Monday, 2 November 2026

సిరిసిల్లలో  మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు బాధ్యత ఎంపీ బండి సంజయ్ తీసుకోవాలి.

సిరిసిల్లలో  మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు బాధ్యత ఎంపీ బండి సంజయ్ తీసుకోవాలి.
కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్ 21. (జనంసాక్షి) కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన మెగా టెక్స్ టైల్ పార్క్ సిరిసిల్లలో ఏర్పాటు చేసేలా చొరవ తీసుకోవాల్సిన బాధ్యత స్థానిక ఎంపీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు  బండి సంజయ్ పై ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పోన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మర మగ్గాలు సిరిసిల్లలో ఉన్నాయని ఈ విషయాన్ని గమనంలో ఉంచుకొని ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన మెగా టెక్స్ టైల్ పార్క్ సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికే  వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని మెగా టెక్స్ టైల్ పార్కును మాత్రం సిరిసిల్లలోని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ లుగా బోయిన్పల్లి వినోద్ కుమార్, బండి సంజయ్ లు చేసింది ఏమీ లేదని విమర్శించారు. తన హయాంలో కేంద్రీయ విద్యాలయంతో పాటు, బీడీ కార్మిక వైద్యశాలను తీసుకువస్తే కనీసం వాటి నిర్మాణం కోసం స్థలాన్ని కూడా ఇవ్వకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ నాయకులు చెబుతున్నట్టు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కోసం చేసిన పనులపై బహిరంగ చర్చకు రావాలని అన్నారు. సిరిసిల్లలో మెగా టెక్స్ ట్ పార్క్ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందని సిరిసిల్లలోని అన్ని  శ్రేణులు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, నాగుల సత్యనారాయణ గౌడ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు, మైనార్టీ సెల్ నాయకులు ఎండి రియాజ్, అన్ని మండలాల నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.