Tuesday, 3 November 2026

సీబీఐ కోర్టులో జగన్‌కు చుక్కెదురు

– జగన్‌ తరుపు న్యాయవాది అభ్యర్థనను తిరస్కరించిన న్యాయస్థానం
– హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో జగన్‌..?
– ముఖ్యనేతలతో సమావేశమైన జగన్‌
– పాదయాత్ర, అసెంబ్లీ సమావేశాలపై చర్చ
హైదరాబాద్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి) :  వైకాపా అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆయన చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. నవంబరు 2 నుంచి మే 2 వరకు ఆరు నెలల పాటు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలంటూ వై.ఎస్‌.జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై  సీబీఐ కోర్టు ఈ నెల 20న విచారణ చేపట్టింది. జగన్‌ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ రైతుల ఆత్మహత్యలు, బడుగు, బలహీనవర్గాల ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి 3 వేల కిలోవిూటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావడం వల్ల పాదయాత్రకు విరామం ఇవ్వాల్సి ఉంటుందని, దీని వల్ల సమస్యలపై చేస్తున్న ఆ పాదయాత్ర ప్రభావంలో తీవ్రత తగ్గుతుందన్నారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 205 కింద దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసిందని, హాజరు మినహాయింపు ఇచ్చే విచక్షణాధికారం ఇదే కోర్టుకు ఉందని చెప్పిందని వివరించారు. హైకోర్టు కొట్టివేసినందున సీఆర్‌పీసీ సెక్షన్‌ 317 కింద పిటిషన్‌ దాఖలు చేయకూడదన్న నిబంధన ఏవిూలేదన్నారు. హాజరు మినహాయింపునకు అనుమతించడం వల్ల విచారణ పక్రియకు ఎలాంటి అడ్డంకి ఉండదని చెప్పారు. అందులోనూ ప్రస్తుతం డిశ్ఛార్జి పిటిషన్‌లపైనే విచారణ కొనసాగుతోందని, హాజరు మినహాయింపునకు అనుమతించాలని కోరారు. ఇదిలా ఉంటే సోమవారం సీబీఐ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జయబాలన్‌ తన వాదనలు వినిపిస్తూ కేసుల విచారణకు జగన్‌ హాజరు తప్పనిసరని పేర్కొన్నారు. హాజరు మినహాయింపునకు హైకోర్టు తిరస్కరించిందని చెప్పారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 317 కింద ఆ రోజు వరకు మాత్రమే మినహాయింపు కోరవచ్చని, భవిష్యత్తులోని వాయిదాలకు మినహాయింపు కోరడాన్ని చట్టం అనుమతించదని పేర్కొన్నారు. ఆ రోజు వాయిదాకు తగిన కారణాన్ని పేర్కొంటూ మినహాయింపునకు కోర్టు అనుమతి కోరవచ్చన్నారు.గతంలో కూడా తగిన కారణాలను పేర్కొంటూ మినహాయింపు కోరినపుడు కోర్టు అనుమతించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. ఇలాంటి తీవ్రమైన కేసుల్లో నిందితుడికి హాజరు నుంచి మినహాయింపునివ్వడం సరికాదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తరఫు న్యాయవాది మన్మథరావు తెలిపారు. గతంలో హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్న అంశాలతోనే ఇక్కడా వేశారని, అక్కడ పూర్తి మినహాయింపు కోరారని, ఇక్కడ ఆరు నెలలు అని మాత్రమే పేర్కొన్నారని వివరించారు. ప్రతి వాయిదాకు సరైన కారణం పేర్కొంటూ అదే రోజు పిటిషన్‌ వేసి అనుమతి కోరవచ్చని, అంతేగానీ ఆరు నెలలపాటు మినహాయింపు కోరడానికి చట్టం అనుమతించదని, ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం… వారానికి ఒక్కసారి జరిగే విచారణకు హాజరైతే వచ్చే ఇబ్బందేమిటంటూ జగన్‌ తరపు న్యాయవాదిని  ప్రశ్నించింది.  ఒక పౌరుడిగా కోర్టుల పట్ల గౌరవంతో హాజరవుతున్నానని ప్రజలకు చెప్పవచ్చంది. వారం మొత్తం పాదయాత్ర నిర్వహించి ఒక్క శుక్రవారం కోర్టుకు రావచ్చని, దీని వల్ల కొంత విశ్రాంతి కూడా లభించినట్లుంటుందని పేర్కొంది.
దీనిపై సీబీఐ న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరిస్తూ జగన్‌ అభ్యర్థనను తోసిపుచ్చింది. వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ కొట్టివేసింది.
ముఖ్యనేతల జగన్‌ సమావేశం..
సీబీఐ కోర్టులో జగన్‌కు చుక్కెదుకావటంతో ఈ రోజు జరగాల్సిన వైసీపీ ఎల్పీ సమావేశాన్ని జగన్‌ రద్దు చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పాదయాత్రపై ఏం చేయాలనే దానిపై చర్చించారు. ఏ చేస్తే బాగుటుందో పార్టీ నేతలను అడిగినట్లు తెలుసుకున్నారు. కోర్టు తీర్పుతో జగన్‌ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. నవంబర్‌ 2 నుంచి కడప జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు జగన్‌ పాదయాత్ర చేయాలని షెడ్యూల్‌ ఖరారు చేసిన విషయం తెలిసిందే. పాదయాత్ర ఆరు నెలలు చేయాలని నిర్ణయించారు. ఈ సమయంలోనే రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. నవంబర్‌ రెండవ వారం నుంచి శీతాకాల సమావేశాలు, ఫిబ్రవరిలో బడ్జట్‌ సమావేశాలు జరుగబోతున్నాయి. అయితే బడ్జట్‌ సమావేశాలకు జగన్‌ తప్పకుండా హాజరుకావాల్సి ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. అటు కోర్టు తీర్పు ఇటు పాదయాత్ర కారణంగా బిజీగా ఉన్న తరుణంలో జగన్‌ వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం అనుమానంగా ఉంది. అందుకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు సీబీఐ కోర్టు సవాలు చేస్తూ జగన్‌ హైకోర్టు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.