Tuesday, 3 November 2026

స్వయం ఉపాధికోసం వందశాతం సబ్సిడీపై ఆర్థిక సాయం

– డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో పదిశాతం మైనార్టీలకు దక్కేలా చర్యలు
– మైనార్టీ సంక్షేమంపై సవిూక్షలో సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌, అక్టోబర్‌23(జ‌నంసాక్షి) : మైనార్టీలకు అన్ని విధానాలకు తెరాస ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇప్పటికే పలు పథకాలతో అన్ని విధాలా ఆదుకుంటున్నామని, రాబోయే కాలంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలతో మైనార్టీలకు అండగా ఉంటామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. సోమవారం మైనార్టీ సంక్షేమంపై సీఎం కేసీఆర్‌ సవిూక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలతో మైనారిటీలు లబ్ది పొందే విధంగా చూడాలన్నారు. పేద మైనారిటీ యువకుల స్వయం ఉపాధి కోసం…బ్యాంకులతో సంబంధం లేకుండా వందశాతం సబ్సిడీపై ఆర్థిక సాయం అందేలా చేస్తామని సీఎం తెలిపారు. లక్ష, రెండు లక్షలు, రెండున్నర లక్షలు విలువైన యూనిట్లకు సాయం చేస్తామన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలో పదిశాతం మైనారిటీలకు దక్కేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యాసంస్థల్లో ఉర్ధూ టీచర్ల పోస్టులు భర్తీ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరిగే పోటీ పరీక్షల్లో…ఇంగ్లీషు, తెలుగుతో పాటు ఉర్దూ భాషలో కూడా నిర్వహించాలన్నారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకంలో మైనార్టీలకు లబ్ధిచేకూరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ముస్లింల కోసం ప్రత్యేక పారిశ్రామిక వాడ, ఐటీ కారిడార్‌ ఏర్పాటు చేస్తామన్నారు. మైనార్టీల సంక్షేమానికి అధికారులు మరింత శ్రద్ధతో పని చేయాలని ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో మైనార్టీలు లబ్ధి పొందేలా కార్యాచరణ ఉండాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఇస్లామిక్‌ కల్చరల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. కోకాపేటలో 10 ఎకరాల్లో హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌
ఇస్లామిక్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ నెలకొల్పుతామని తెలిపారు. మూడు వారాల్లోగా ఈ సెంటర్‌ నిర్మాణ పనులు ప్రారంభం కావాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాబోయే కాలంలో మైనార్టీ లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారికి అన్ని విధాల సహయాసహకారాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా స్పందించిన సీఎం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మైనార్టీలకు లబ్ధిజరగేలా చూస్తామని తెలిపారు.