Wednesday, 4 November 2026

సుంకాలను ఎత్తేస్తే ఆర్టీసీకి లాభాలు: కోదండరామ్‌

హైదరాబాద్‌,మే26(జ‌నంసాక్షి): ఆర్టీసీ నష్టాలకు కార్మికులను బాధ్యులను చేయడం సరికాదని టీజేఎస్‌ నేత కోదండరాం అన్నారు. డీజిల్‌ విూద వచ్చే పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగిందని, పన్నుల నుంచి ఆర్టీసీకి మినహాయింపు ఇవ్వాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. బహీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, బీజేపీ నేత సాంబమూర్తి, ఆర్మీసీ కార్మిక సంఘాలు హాజరయ్యాయి. సమావేశంలో ఆర్టీసీ పరిరక్షణ, వేతన సవరణ, ప్రభుత్వ వైఖరిపై చర్చించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. అనివార్య పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీస్‌ ఇచ్చాయన్నారు. వేతన సవరణ కోసం పోరాడే కార్మికులకు మద్దతిస్తామని కోదండరాం ప్రకటించారు.