మహానాడులో తెలుగు యువత ఉత్సాహం
విజయవాడలో కవాతుతో ఆకట్టుకున్న కార్యకర్తలు
విజయవాడ,మే26(జనంసాక్షి): పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపేందుకు తెలుగు యువత కవాతు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రి దేవినేని ఉమ, ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వాలంటీర్లుగా కవాతులో పాల్గొన్నారని అన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ 1982 మార్చి 29న పార్టీని స్థాపించారని, 9 నెల్లలో పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. కార్యకర్తలు, నాయకులు, మహిళలు, యువతీ యువకులు, రైతులు, రైతు కూలీలు అన్ని వర్గాల ప్రజలు ఎన్టీఆర్‌కు జేజేలు పలికారని మంత్రి పేర్కొన్నారు. మూడు రోజుల పాటు విజయవాడలో జరిగే మహానాడు పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యారని ఆయన చెప్పారు. ఈ మహానాడులో దశా దిశ నిర్దేశం చేసే విధంగా… రేపు జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామానికి సీఎం చంద్రబాబు శంఖారావం పూరించనున్నారని మంత్రి ఉమ పేర్కొన్నారు.