– అప్పుల బాధ తాళలేక నిండు కుటుంబం ఆత్మహత్య
సూర్యాపేట,సెప్టెంబర్ 18,(జనంసాక్షి): అప్పుల బాధలు తాళలేక ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన జిల్లా కేంద్రంలోని కస్తూరి బజార్ రెడ్డి హాస్టల్ సవిూపంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కస్తూరి జనార్ధన్(బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి), చంద్రకళ దంపతులకు ఇద్దరు కుమారులు.. సురేశ్, అశోక్ ఉన్నారు. సూర్యాపేటలో సురేశ్ కంప్యూటర్ దుకాణం నడుపుతున్నాడు. స్టాక్ మార్కెట్లో కూడా డబ్బులు భారీగా ఇన్వెస్ట్ చేశాడు. మొత్తానికి భారీగా నష్టపోయిన సురేశ్ అప్పుల పాలయ్యాడు. గత కొంతకాలం నుంచి అప్పులు ఇచ్చిన వ్యక్తులు సురేశ్‌ను డబ్బుల కోసం వేధిస్తున్నారు. దీంతో వారం రోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా సురేశ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఒక వైపు కుమారుడు చెప్పపెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోవడం.. మరో వైపు అప్పులు ఇచ్చినోళ్లు.. ఇంటికొచ్చి వేధించడంతో జనార్ధన్ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. ఏమి చేయాలో తోచని జనార్ధన్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం రాత్రి కూల్ డ్రింక్స్‌లో పురుగుల మందు కలుపుకొని జనార్ధన్(55)తో పాటు ఆయన భార్య చంద్రకళ(50), చిన్న కుమారుడు అశోక్(25), కోడలు ప్రభత(30), ఇద్దరు పిల్లలు సిరి(5), రిత్విక్(2) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సురేశ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జనార్ధన్ బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు





