– మంత్రి ద్రోహానికి బలి
– శరీరానికి నిప్పంటించుకుని ఆత్మాహుతి
– గాయాలతో పోరాడి తుదిశ్వాస విడిచిన ఖాన్
హైదరాబాద్,సెప్టెంబర్ 22,(జనంసాక్షి): ఆత్మహత్యకు పాల్పడ్డ టిఆర్‌ఎస్ నేత చికిత్స పొందుతూ మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన తెరాస నేత, పట్టణ మాజీ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్(52) శుక్రవారం తెల్లవారుజామున చికిత్సపొందుతూ మృతిచెందాడు. పట్టణంలో గతనెల 30న స్థానిక సమ్మద్ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన తెరాస సమావేశంలో అయూబ్ ఖాన్ తనకు అన్యాయం జరిగిందంటూ మనస్తాపానికి గురై మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలోనే ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన మంత్రి, తెరాస కార్యకర్తలు పోలీసు వాహనంలో స్థానిక జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో డీఆర్‌డీఏ ఆస్పత్రికి తరలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయనిధి కింద వైద్య ఖర్చుల కోసం రూ.20 లక్షలు మంజూరు చేశారు. దాదాపు నెలరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న మంత్రి మహేందర్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి అయూబ్‌ఖాన్ మృతదేహానికి నివాళులర్పించారు. అయూబ్‌ఖాన్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆది నుంచి తెరాసలో ఉన్న ఆయన తనకు నియమిత పదవి రాలేదంటూ ఆవేదనకులోనై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయూబ్‌ఖాన్ మృతి నేపథ్యంలో పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.





