Monday, 2 November 2026

సెప్టెంబర్‌ ను మర్యాద మాసంగా పాటించనున్న జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌,ఆగస్టు30 : జీహెచ్‌ఎంసీలో సెప్టెంబర్‌ మాసాన్ని మర్యాదమాసంగా పాటించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే మర్యాదగా మాట్లాడుకుందాం, ఐ లవ్‌ మై జాబ్‌, సేవ్‌ ఎనర్జీ, చిన్న పొరపాటుకు భారీ మూల్యం తదితర సందేశాలు కలిగిన స్టిక్కర్లను రూపొందించి జీహెచ్‌ఎంసీలోని అధికారులు, సిబ్బందికి గతంలో పంపిణీ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి అధికారి, ఉద్యోగి తమ విధులను వందశాతం నిబద్దతతో నిర్వహించడానికి దోహదపడ్డాయి. అయినప్పటికీ కోటికిపైగా జనాభా, 625 చదరపు కిలోవిూటర్ల విస్తీర్ణం, నిరంతరం ప్రజల నుండి వందలాది ఫిర్యాదులు, ప్రభుత్వానికి పంపే నివేదికలు, లక్ష్యాల సాధనకై తీవ్ర ఒత్తిడి…ఇలా జీహెచ్‌ఎంసీఅధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ఒత్తిళ్లకులోనై పనిచేస్తున్నారు. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ అధికారులు ఇతర శాఖల అధికారులు, ఉన్నతాధికారులు, సిబ్బందితో సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో సంయమనాన్ని కోల్పోకుండా ఉండాలని అప్పుడే మెరుగైన పౌరసేవలు అందించడం వీలవుతుందన్నారు. ప్రతి ఒక్కరిని గౌరవంగా చూడడంతో పాటు జవాబుదారిగా విధులు నిర్వహించాలనే ఉద్దేశంతో సెప్టెంబర్‌ మాసాన్ని మర్యాద మాసోత్సవంగా నిర్వహించాలని జనార్ధన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా ప్రతి కార్యాలయంలో బోర్డుల ప్రదర్శన, క్రిందిస్థాయి సిబ్బంది నుంచి సామాన్య పౌరుడికి మర్యాదను ఇవ్వడంతో పాటు వారి పనులకు సంబంధించిన సమస్యలను సావదానంగా వినడం, సవివరమైన సమాధానాలు ఇవ్వాలని కమిషనర్‌ తెలిపారు. ఈ మర్యాద మాసోత్సవం ద్వారా బల్దియాలోని ప్రతి ఒక్క అధికారి, ఉద్యోగి తాము బాధ్యతాయుతంగా విధులు నిర్వహించడం, మరింత జవాబుదారిగా ఉండేందుకు పొరపాట్లు చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంలో దోహదపడుతుందని అభిప్రాపడుతున్నారు.