Tuesday, 3 November 2026

సైబరాబాద్ పోలీసుల సమస్యల పరిష్కారానికి ‘గ్రీవెన్స్ సెల్ సమావేశం’ ఉపయుక్తంగా ఉంటుంది

సైబరాబాద్ అడ్మిన్ డిసిపి ఇందిర”

శేరిలింగంప‌ల్లి, 07( జనంసాక్షి): సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సైబరాబాద్ పోలీస్ బాస్ స్టీఫెన్ రవీంద్ర, డీసీపీలుగా తాము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని సైబరాబాద్ కమిషనరేట్ అడ్మిన్ డిసిపి ఇందిర, క్రైమ్ డిసిపి కల్మేశ్వర్ సింగన్వర్ తెలిపారు. ఈమేరకు సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయం పరిధిలో డిసిపి లు, ఇతర ఉన్నతాధికారులతో కలిపి గురువారం ‘గ్రీవెన్స్ సెల్’ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్లో గ్రీవెన్స్ సమీక్ష సమావేశాలను తరచుగా నిర్వహిస్తున్నామని తద్వారా ఆయా పోలీస్ అధికారులు, సిబ్బందికి సంబంధించిన ఉద్యోగ సమస్యలు, ఇతర సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతోపాటు శీఘ్రగతిన పరిష్కారం అయ్యేందుకు మార్గం సుగమయిందన్నారు. గ్రీవెన్స్ సమావేశంలో తప్పనిసరిగా డీసీపీ స్థాయి, ఇతర ఉన్నతస్థాయి అధికారులు పాల్గొంటుండడంవల్ల పోలీసుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్తూ తొందరగా పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేయడమనేది ఒక విప్లవాత్మక మార్పు అని, పోలీసు శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి ఇది ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు. గురువారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ సమీక్ష సమావేశంలో ముఖ్యంగా పర్మిషన్స్, ఆర్మ్స్ లైసెన్స్, బ్లాస్టింగ్ పర్మిషన్లు, ముల్టిప్లెక్స్, పెట్రోల్ బంక్స్, ఈవెంట్స్ పర్మిషన్లు, HRMS వాడుక., సిబ్బంది సమస్యలు తదితర అంశాలు చర్చకు రావడం జరిగిందన్నారు. గతవారం గ్రీవెన్స్ సెల్ కు వచ్చిన ఫిర్యాదులు పరిష్కారంపై వారు సంతృప్తిని వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే ఈవారం వచ్చిన ఫిర్యాదులను, పెండింగ్ ఫైల్స్ ను త్వరితగతిన పరిష్కరించాలని, సీఏఓ లు, సెక్షన్ సూపరింటెండెంట్లు ఎప్పటికప్పుడు సమస్యలను సులభరతరంచేసి పరిష్కరించాలని ఆదేశించారు. సిబ్బందికి సమస్యలుంటే ఉంటే గ్రీవెన్స్ సెల్(8333993272) ద్వారా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీ శ్రీనివాస్ రావు, బాలానగర్ డీసీపీ సందీప్, సిఆర్ హెడ్ క్వార్టర్ ఏడీసీపీ ఎండీ రియాజ్ ఉల్ హక్, సిఎస్‌డబ్ల్యూ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ చంద్రకళ, చీఫ్ అడ్మిన్ ఆఫీసర్ గీత మరియు వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.