– మధుసూదన్ కుటుంబానికి తోటి ఎస్సైల ఆర్థికసాయం
– మృతుడి తండ్రి, కూతురుపేరుపై రూ.10లక్షల ఫిక్స్‌డిపాజిట్
– రాచకొండ సీపీ భగవత్ చేతులువిూదుగా పత్రాలు అందజేత
హైదరాబాద్, మే4(జనంసాక్షి) : రోడ్డుప్రమాదంలో మృతిచెందిన పోచంపల్లి ఎస్సై కె. మధుసూదన్‌కు అండగా నిలిచారు తొలి బ్యాచ్‌మెట్ ఎస్సైలు. ఉమ్మడి ఆంధప్రదేశ్ 2012 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలు ఆ కుటుంబానికి తాము ఉన్నామంటూ ధైర్యాన్ని చెప్పి ఆర్థికంగా ఆదుకున్నారు. గత నెల 5వ తేదీన ఉదయం 5.30 గంటలకు పోచంపల్లి ఎస్సైగా విధులు నిర్వహిస్తోన్న కె. మధుసూదన్ నల్గొండకు పోలీస్ రిక్రూట్మెంట్ ఈవెంట్స్ బందోబస్తుకు కోసం వెళ్తుండగా.. మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నార్కెట్ పల్లి దగ్గర వాహనం అదుపు తప్పి మృతిచెందారు. అండగా ఉన్న కొడుకును కోల్పోయి తల్లిదండ్రులు, పెద్ద దిక్కుని కోల్పోయి ఆయన కుటుంబం ఒంటరైంది. దీంతో మధుసూదన్ కుటుంబాన్ని ఆదుకోవాలని బ్యాచ్‌మెంట్స్ నిర్ణయించుకున్నారు. మధుసూదన్ తండ్రి కొండయ్య, తల్లి అంజమ్మ, భార్య జ్యోతి, కుమారుడు దుర్గదీక్షిత్(6), కూతురు శ్రీవైష్ణవి(4)కి మేం ఉన్నామంటూ ధైర్యాన్ని చెప్పారు. 2012 బ్యాచ్ ఎస్సైలంతా కలిసి మధుసూదన్ తల్లిదండ్రుల పేరుపై రూ. 4 లక్షలు, కూతురు పేరుపై రూ.6 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. దానికి సంబంధించిన పత్రాలను రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ చేతులవిూదుగా ఆ కుటుంబానికి శనివారం ఇప్పించారు. వారికి భరోసా కల్పించారు. 2012 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలను ఈ సందర్భంగా సీపీ మహేష్ భగవత్ అభినందించారు. ఈ ఏడాది పిల్లల స్కూల్ ఫీజును చెల్లిస్తానని సీపీ తెలిపారు, మధుసూదన్ భార్యకు త్వరలోనే ఉద్యోగం వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీసుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి, ఉమ్మడి సైబరాబాద్, రాచకొండ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఎస్సైలు విజయ్, సంజీవరెడ్డి, జగన్ రెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.




