అఫ్రిది వింత మనిషి

– మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తా
– అఫ్రిది వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన బీజేపీ నేత గంభీర్‌
న్యూఢిల్లీ, మే4(జ‌నంసాక్షి) : అఫ్రిది ఒక వింత మనిషి అని, ఆయన్ను మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తానని మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ అభ్యర్థి గౌతమ్‌ గంభీర్‌ అఫ్రిది వ్యాఖ్యలకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. తన ఆటోబయోగ్రఫీ ‘గేమ్‌ ఛేంజర్‌’లో పాక్‌ మాజీ క్రికెటర్‌ అఫ్రిది పలు సంచలన, వివాదాస్పద అంశాలను పేర్కొన్న సంగతి తెలిసిందే . క్రికెట్‌ ఆడుతున్న సమయంలో మైదానంలోనూ, బయట ఆఫ్రిదికి, గంభీర్‌కు మధ్య అంత సఖ్యత లేని విషయం తెలిసిందే. గంభీర్‌ గురించి తన ఆత్మకథ ‘గేమ్‌ చేంజర్‌’లో ప్రస్తావిస్తూ.. డాన్‌ బ్రాడ్‌మన్‌, జేమ్స్‌ బాండ్‌కు మధ్యరకంలా గంభీర్‌ ప్రవర్తిస్తూ ఉంటాడని, ఆటలో అతనికి పెద్ద రికార్డులు లేకపోయినా.. అటిట్యూడ్‌ మాత్రం చాలా ఎక్కువ అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘కొన్ని శత్రుత్వాలు వ్యక్తిగతమైనవి. కొన్ని వృత్తిపరమైనవి. గంభీర్‌ విషయానికొస్తే.. ఓహ్‌ పూర్‌ గౌతం. అతను, అతని అటిట్యూడ్‌ ప్రాబ్లం గురించి చెప్పాలి. అతనికి పెద్దగా వ్యక్తిత్వం లేదు. గొప్ప క్రికెట్‌ ఆటలో అతనొక
క్యారేక్టర్‌ మాత్రమే. అతనికి పెద్ద రికార్డులు లేకున్నా అటిట్యూడ్‌ మాత్రం చాలా ఉంది’ అని ఆఫ్రిది రాసుకొచ్చాడు. 2007లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌ వన్డేలో తనకు, గంభీర్‌కు మధ్య జరిగిన గొడవను ఆఫ్రిది ప్రస్తావించాడు. అయితే, ఈ గొడవ ఆసియా కప్‌లో జరిగిందని తప్పుగా పేర్కొన్నాడు. ‘2007 ఆసియా కప్‌లో గంభీర్‌తో గొడవ నాకు గుర్తుంది. సింగిల్‌ రన్‌ను కంప్లీట్‌ చేసిన వెంటనే అతను నేరుగా నా విూదకు వచ్చాడని, ఎంపైర్లు ఈ గొడవ సద్దుమణిగేలా చేశారని అఫ్రిది తెలిపారు. లేకుంటే నేనే చేసేవాడిని అన్నారు. నిజాయితీగా చెప్పాలంటే.. ఈ సందర్భంగా మా మహిళా బంధువుల గురించి మేం ద్వైపాక్షిక చర్చకు దిగామని ఆఫ్రిది పేర్కొన్నాడు. అఫ్రిది వ్యాఖ్యలపై గంభీర్‌ అభిమానులు మండిపడ్డారు. అఫ్రిది స్థాయి మించి మాట్లాడుతున్నాడని విమర్శలు గుప్పించారు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ల వేదికగా అఫ్రిది వ్యాఖ్యలను ఖండించారు. ఈనేపథ్యంలో ఆఫ్రిదీపై గంభీర్‌ విరుచుకుపడ్డాడు. ఆఫ్రిది ఒక వింత మనిషి అని ఘాటుగా విమర్శించారు. మెడికల్‌ టూరిజంలో భాగంగా పాకిస్థానీలకు భారత్‌ ఇప్పటికీ వీసాలు జారీ చేస్తోందని.. నిన్ను స్వయంగా మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళతానని ట్వీట్‌ చేశాడు. అంతే కాదు ఈ ట్వీట్‌ ను ఆఫ్రిదీకి ట్యాగ్‌ చేశాడు. దీంతో గంభీర్‌ అభిమానులు మంచి కౌంటర్‌ ఇచ్చారంటూ గంభీర్‌పై ట్వీట్‌ను ప్రశంసిస్తున్నారు.