ప్రభుత్వ ఆదేశాలతో అన్ని పాఠశాలల్లో ఉత్సవాలు
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్
మేడ్చల్(జనంసాక్షి): మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం సూచించిన విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యా శాఖపరంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉత్సవాలను ఘనంగా జరపడానికి రోజువారీగా అనేక కార్యక్రమాలను ప్రతిపాదించిందని దీనిని క్షేత్రస్థాయిలో దిగ్విజయంగా జరిగేలా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఈనెల 8వ తేదీన వజ్రోత్సవాల కార్యక్రమాల ప్రారంభోత్సవాన్ని రాష్ట్రస్థాయిలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొని ప్రారంభింస్తారని వివరించారు. వజ్రోత్సవాలలో విద్యార్థులకు దేశభక్తిని పెంపొందించడానికి ఈ నెల 9వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జిల్లాలోని అన్ని థియేటర్లలో ‘గాంధీ’ మూవీని స్పెషల్ షోగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రదర్శించే గాంధీ మూవీకి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఆరు తరగతి నుండి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఉచితంగా ప్రవేశం కల్పించాలని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 1,540 పాఠశాలల్లో మొత్తం విద్యార్థులు 2,92,764 చిత్రాన్ని 40 థియేటర్లలో చూసే విధంగా అన్ని రకాల ఏర్పాట్లను ట్రాన్స్పోర్టు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు పూర్తి చేశారని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో థియేటర్ల సంఖ్యకు అనుగుణంగా, ఆయా పాఠశాలల వారీగా విద్యార్థులను థియేటర్లలో గాంధీ మూవీని చూపించాలని. విద్యార్థులకు ఏ చిన్న ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హరీశ్ ఆదేశించారు




