Thursday, 5 November 2026

స్వతంత్ర సమరజ్వాలా… భగత్ సింగ్

*అదే స్ఫూర్తి తో నేటికీ భగత్ సింగ్ అడుగు జాడల్లో యువత..
*మతోన్మాదంపై పోరాటమే భగత్ సింగ్ కు నిజమైన నివాళి… డా -సత్యం శ్రీరంగం

కూకట్ పల్లి జనంసాక్షి :భారత యువతలో స్వేచ్చాకాంక్షని రగిలిచ్చిన విప్లవ జ్యోతి భగత్ సింగ్ అని నేటికీ యువత భగత్ సింగ్ నుండి ఎంతో స్ఫూర్తిని పొందుతున్నారని టిపిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం అన్నారు. బుధవారం భారత స్వాతంత్య్ర ఉద్యమ కారుడు భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ 115 వ జయంతి సందర్బంగా కూకట్ పల్లి నియోజక వర్గం ఫతే నగర్ లోని భగత్ సింగ్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు, ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదంతో 12 ఏళ్ళ అతి చిన్న వయస్సులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని 23 ఏళ్ళ యువ ప్రాయంలోనే దేశం కోసం ప్రాణాలర్పించి ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలిచి దేశ భక్తిని రగిలించిన సమరయోధుడు విప్లవ మూర్తి భగత్ సింగ్ అన్నారు. భగత్ సింగ్ మరణం భారత స్వాతంత్య్రోద్యమ కొనసాగింపుకు సాయపడేలా వేలాది మంది యువకుల్లో స్ఫూర్తిని నింపిందని, భగత్ సింగ్ వీర మరణం వృథా కాలేదని ఎందరో యువకులను భారత స్వాతంత్య్ర ఉద్యమం వైపుకు మరలించిందని అన్నారు.ఈ కార్యక్రమంలో చంటి సింగ్, జీత్ సింగ్, ఇందర్ సింగ్, బల్ భీర్ సింగ్, బుద్దు సింగ్, ముఖేంధర్, హేమంత్, శేఖర్ గజానంద్, భరత్ యువకులు తదితరులు పాల్గొన్నారు.