మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై20
పదమూడు సంవత్సరాల క్రితం తండ్రిని చంపాడని కక్షతో కర్ణాటక రాష్ట్రానికి చెందిన సుపారీ పిలిపించి హత్య చేయించిన వ్యక్తిని జవహర్ నగర్ పోలీసులు,మల్కాజిగిరి ఎస్వోటి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నేరెడ్ మెట్ లోని సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.ఈనెల 16న దమ్మాయిగూడ వైన్స్ షాప్ దగ్గర హత్యకు గురైన రఘుపతి (41) పదమూడు సంవత్సరాల క్రితం 2009 లో మాజీ సర్పంచ్ జంగారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు.తన తండ్రి హత్యకు ప్రతీకారంగా రఘుపతి ని ఎలాగైనా చంపాలనే ఆలోచనతో కక్ష పెంచుకుని జంగారెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి పథకం ప్రకారం కర్ణాటక రాష్ట్రానికి చెందిన సుపారీ గ్యాంగ్ తో 30లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని వారికి మారణాయుధాలు,ఒక కారు,ద్విచక్ర వాహనం,సెల్ ఫోన్లు కొనిచ్చి కీసరగుట్ట లోని ఒక ఫామ్ హౌస్ లో వారికి సెల్టర్ ఏర్పాటు చేశాడు.పది రోజుల నుండి రఘుపతి హత్యకు రెక్కీ నిర్వహించి వైన్ షాప్ దగ్గర హత్య చేసి పారిపోయారని తెలిపారు.రఘుపతి భార్య అంబటి స్వర్ణలత ఇచ్చిన సమాచారం మేరకు శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడని ఇతనితో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన 5గురిని,ఒక కారు,ద్విచక్ర వాహనం,సెల్ ఫోన్లు,మారణ ఆయుధాలను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్ కు తరలించారని తెలిపారు.





