Wednesday, 4 November 2026

హరితహారానికి సవాల్‌గా మారిన నర్సరీల ఏర్పాటు

తడిసి మోపెడు అవుతున్న ఖర్చులు

హైదరాబాద్‌,ఏప్రిల్‌5(జ‌నం సాక్షి): నాలుగో విడత హరితహారం కోసం ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ సిద్దం చేసింది. వందలాది నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. అయితే సకాలంలో వర్షాలు లేకపోవడంతో నర్సరీలకు శాపంగా మారాయి. రానున్న రోజుల్లో సగం నర్సరీల్లో నీటి సమస్య వచ్చేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు మొక్కలు ఎండకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హరితహారం కార్యక్రమానికి మొక్కలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు. సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నర్సరీల్లోని బోర్లలో నీటి మట్టం పడిపోతే సవిూప బోర్లను అద్దెకు తీసుకోవడం, లేదంటే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాచేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. అవకాశం ఉన్న చోట సవిూప నర్సరీలకు మొక్కలను తరలించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి.. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు..గతేడాది ఎండ తీవ్రతతో మొక్కలు పూర్తి స్థాయిలో పెరగలేదు. మరోవైపు నర్సరీల్లో నీటి సమస్య ఉత్పన్నమవుతుండగా.. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించారు.. గతేడాది మిగిలిపోయిన మొక్కల కవర్లను మార్చడానికి నిర్ణయం తీసుకున్నారు.. అవసరం కంటే కూడా ఎక్కువ మొత్తంలో అధికారులు మొక్కలు పెంచుతున్నారు. దీంతో ఎండలతో అటవీశాఖ అధికారులకు మొక్కలు పెంచడం పెద్ద సమస్యగా మారింది. గత అనుభవం దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది మొదట్లోనే అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి నర్సరీ వద్ద హరిత పందిరి ఏర్పాటు చేశారు. ఫలితంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికి మొక్కలపై నేరుగా ప్రభావం చూపదు. ప్రతి నర్సరీలో కూడా తొంభైశాతం మొక్కలలో అధికారులు పెరుగుదల గుర్తించారు. ఎండల తీవ్రత ఒకవైపు పెరుగుతుంటే మరో వైపు నీటి సమస్య నర్సరీలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రధానంగా నర్సరీలు ఉండే ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, ఇతర ప్రాంతాలకు మొక్కలను తరలించడం వంటివి అటవీశాఖ అధికారులకు అదనపు భారం కానుంది.

——–