Tuesday, 3 November 2026

హైకోర్టుకు హామీ ఇచ్చిన ప్రభుత్వం

కోర్టుకు వచ్చినవారి భూములు కొనుగోలుచేయం
123 జీవో ద్వారా వారినుంచి సేకరించం
జీవో ద్వారా వారినుంచి సేకరించం 
అఫిడవిట్‌ సమర్పణ

పిటిషనర్ల వ్యాజ్యాలపై కౌంటరు దాఖలు చేయాలన్న ధర్మాసనం
22కు విచారణ వాయిదా
2014-11-06_184758_High_Courtఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో చేపట్టే మల్లన్నసాగర్‌, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, గౌరవెల్లి రిజర్వాయర్‌ తదితర ప్రాజెక్టులకు అవసరమైన భూములను స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారి నుంచే కొనుగోలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉమ్మడి హైకోర్టుకు తెలిపింది. కోర్టును ఆశ్రయించిన వారి వ్యవహారంలో భూములను జీవో 123 ప్రకారం కొనుగోలు చేయబోమని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ భూములు అవసరమని భావిస్తే భూసేకరణ చట్ట ప్రకారం తీసుకుంటామని పేర్కొంది. ఈమేరకు ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్‌ కూడా సమర్పించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌, జస్టిస్‌ యు.దుర్గాప్రసాద్‌రావులతో కూడిన ధర్మాసనం… ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ కె.రామకృష్ణారెడ్డి ఇచ్చిన హామీని నమోదు చేసింది. 123 జీవో కింద భూమిని ఇవ్వడానికి నిరాకరించిన వారితోపాటు వ్యవసాయ కూలీలు దాఖలు చేసిన పలు పిటిషన్‌లను హైకోర్టు విచారణకు స్వీకరించి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ భూములను ఇవ్వడానికి నిరాకరించిన రైతులను బెదిరిస్తున్నారని, తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించారంటూ పోలీసులే కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. ధర్నా చేపట్టి పోలీసు స్టేషన్‌పై దాడికి వస్తున్నారని, చంపడానికి వస్తున్నారంటూ దౌల్తాబాద్‌ ఎస్‌ఐ పరశురాం రైతులపై కేసు నమోదు చేశారన్నారు. పిటిషనర్లతోపాటు 8 గ్రామాలు, 6 కుగ్రామాలు ముంపునకు గురవుతున్నాయని చెప్పారు. మల్లన్నసాగర్‌ నిమిత్తం 21వేల ఎకరాలను సేకరిస్తున్నారన్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారి నుంచే కొనుగోలు చేస్తున్నామని ఓవైపు చెబుతూ మరోవైపు బలవంతంగా తీసుకుంటున్నారని చెప్పారు. మరో సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ వాదనలు వినిపిస్తూ రైతులు భూములను విక్రయించడానికి నిరాకరించినప్పటికీ సమ్మతించినట్లుగా రికార్డుల్లో పేర్కొంటున్నారని చెప్పారు. నిరాకరించినవారి భూములను అలా వదిలివేస్తారని, అవి ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ భూమి ముంపునకు గురయినట్లయితే 2013 కేంద్ర చట్టం ప్రకారం పరిహారం దక్కుతుంది కదా అంటూ ప్రశ్నించింది.

ఏ రాష్ట్రమూ అమలు చేయడంలేదు: ఏజీ
కేంద్రం తీసుకువచ్చిన 2013 భూసేకరణ చట్టాన్ని ఏ రాష్ట్రమూ అమలు చేయడంలేదని ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. భూముల కొనుగోలు వెసులుబాటుపై కేంద్ర ప్రభుత్వమే సలహా ఇచ్చిందని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ… ఈ చట్టానికి సంబంధించి ఏ కోర్టు ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని, దీనిపై తరువాత విచారిద్దామని తెలిపింది. కోర్టుకు వచ్చినవారి భూములను తీసుకోబోమని హామీ ఇస్తారా అంటూ ప్రశ్నించగా దీనికి ఏజీ అంగీకరించారు. ఈ వ్యవహారంపై అఫిడవిట్‌ను సిద్ధం చేశామంటూ కోర్టుకు సమర్పించారు. బలవంతంగా భూములను తీసుకోమని, స్వచ్ఛందంగా వచ్చినవారి నుంచే కొనుగోలు చేస్తామని, లేదంటే కేంద్ర భూసేకరణ చట్టం, లేదా అమల్లోని చట్టం ప్రకారం సేకరిస్తామని, భూమి లేని పేదలు, కూలీలకు జీవో 190 ప్రకారం పునరావాస ప్యాకేజీ అందజేస్తామని చెప్పారు. రైతులను అధికారులు బెదిరించడం లేదని, భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యే లోపు రైతులు అభిప్రాయాన్ని మార్చుకుని భూమిని తిరిగి తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు. భూసేకరణ చట్టం కంటే ఎక్కువగా పరిహారం చెల్లిస్తున్నామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *