Tuesday, 3 November 2026

హైకోర్టు తీర్పు స‌ర్కారు చెంపపెట్టు

సభ్యత్వాల పునరుద్దరణపై చర్య తీసుకోవాలి

కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారు

అవసరమైతే అంతా రాజీనామా చేసి ఒఓత్తిడి తెద్దాం

కోమటిరెడ్డి వ్యాఖ్య..సర్కార్‌ తీరుపై కాంగ్రెస్‌ నేతల ఆగ్రహం

హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి ): ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు విషయంలో డివిజన్‌ బెంచ్‌ వెలువరించిన తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేయడాన్ని తప్పబడుతూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ 12 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అంశంలో సోమవారం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ సందర్బంగా కోమటిరెడ్డి విూడియాతో మాట్లాడారు.’ కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యే సభ్యత్వం పునరుద్ధరించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి. రాజ్యాంగం, న్యాయవ్యవస్థ విూద కేసీఆర్‌కు నమ్మకం లేదు. ఇలాంటి నియంత తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కావటం దౌర్భాగ్యం అంటూ దుయ్యబట్టారు. న్యాయ వ్యవస్థతో నాటకాలు ఆడుతున్నారు. ప్రజల్ని మోసం చేసినట్టు, న్యాయస్థానాన్ని కూడా మోసం చేస్తున్నారు. డబ్బుల కోసం పార్టీ మారిన ఎమ్మెల్యేలు పిటిషన్‌ వేశారు. కోర్టు ధిక్కార నోటీసులు ఇస్తాం. అసెంబ్లీ కార్యదర్శి.. సీఎస్‌లను కూడా బాధ్యులను చేస్తాం. సీఎం రాజీనామా చేసే పరిస్ధితి వస్తుంది. రేపటి లోపల మా సభ్యత్వాన్ని పునరుద్ధరించాలి.’ అని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుంటే మా సభ్యత్వాల రద్దు విషయంలో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, జానారెడ్డి లకు చెప్పాను. మేము మా కోసం సభలో ఆందోళన చేయలేదు. అందరం రాజీనామా చేయాలి అనుకున్నాం. ఇప్పుడైనా.. రాజీనామాల విూద నిర్ణయం తీసుకోమని చెప్తున్నా. సీఎల్పీ నేతగా మమ్మల్ని కాపాడుకోవాలి. పార్టీ నాయకులతో చర్చించి అందరం రాజీనామా చేద్దాం. ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి. కానీ రాష్ట్రనాయకత్వం సరిగా స్పందించడం లేదు. రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు పట్టించుకోవటం లేదో వాళ్లనే అడగండన్నారు. ఈ రకంగా రాజీనామాలు చేసి ఒఓత్తిడి పెంచాలన ఇకోమటిరెడ్డి సూచించారని సమాచారం. తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఒక పరీక్ష పెట్టారు. తమను కెసిఆర్‌ ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా గుర్తించడం లేదని, తాజాగా హైకోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినందున , ఇరవై నాలుగు గంటలలో తమ సభ్యత్వాలను పునరుద్దరించాలని కోమటిరెడ్డి అన్నారు. ఒక వేళ కెసిఆర్‌ ప్రభుత్వం ఆ పని చేయకపోతే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు సిద్దం అవ్వవాలని ఆయన కోరారు. తాము సొంత అవసరాలకోసం అసెంబ్లీలో ఆందోళనకు దిగలేదని, పార్టీ ప్రయోజనాల కోసం చేశామని ఆ విషయాన్ని ఉత్తం కుమార్‌ రెడ్డి, జానారెడ్డిలు గుర్తించి తదుపరి కార్యాచరణకు సిద్దం కావాలని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఇదిలావుంటే ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే యత్నం చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం విూడియాతో మాట్లాడుతూ.. ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలను ఎలా సస్పండ్‌ చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ జరుగుతోందని అర్థం చేసుకోవచ్చన్నారు. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి న్యాయస్థానం, వ్యవస్థలపైన సంపూర్ణ విశ్వాసం ఉందిని తెలిపారు. ఇప్పటికైనా స్పీకర్‌ న్యాయస్థానాల తీర్పులను గౌరవించి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌ కుమార్‌ల సభ్యత్వాలను పునరుద్ధరించాలన్నారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలన్నారు. కోర్టుకు వెళ్లడానికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అర్హతేంటని కోర్టు అడిగిందని, తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎలా కూనీ జరుగుతుందో అర్థంచేసుకోవచ్చన్నారు. తెలంగాణ సమాజానికి సీఎం కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని, బహిష్కరించిన ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం చేసిన చర్యను హైకోర్టు కొట్టేసిందని, సుప్రీంకోర్టుకు వెళ్ళరని జైపాల్‌ రెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పు ను అమలు చేయరు. తాను చేసింది రాజ్యాంగ విరుద్ధమని కేసీఆర్‌కు తెలుసు కాబట్టే అప్పీల్‌కు వెళ్లడం లేదు. రాజ్యాంగపరంగా అన్యాయం జరిగింది. ఇలాంటి పరిస్థితి 70 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదు. ఇదంతా చూస్తుంటే తెలంగాణాలో రాజ్యాంగం ఉందా అనిపిస్తుందన్నారు. ఇకపోతే

ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కోలేకపోయిందన్న విమర్శలను ప్రతిపక్షనేత కె. జానారెడ్డి కొట్టిపారేశారు. తనతో మూకుమ్మడి రాజీనామా చేద్దామని కోమటిరెడ్డి అననేలేదని, ఒకవేళ అధిష్టానమే గనుక ఆదేశిస్తే అందరికంటే ముందు తానే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన విూడియాతో మాట్లాడారు. మావాళ్లలోనే కొంతమంది ఒత్తిడితోనో, ఆవేదనతోనో నాయకత్వంపై ఆరోపణలు చేసిఉండొచ్చు. అందుకు ఎవరినీ తప్పుపట్టడంలేదు. సీఎల్పీ తరఫున చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలేమైనా ఉంటే తప్పకుండా పరిశీలిస్తాం. సభ్యత్వాల రద్దు విషయంలో ఇంకాస్త గట్టిగా ప్రతిస్పందించాల్సి వస్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అధిష్టానం సూచనల మేరకు ముందడుగు వేస్తాం. ప్రచారంలో ఉన్నట్లు రాజీనామాల అంశమేదీ మా మధ్య చర్చకు రాలేదు. ఒకవేళ అధిష్టానమే గనుక ఆ నిర్ణయం తీసుకుంటే, ముందు నేనే రాజీనామా చేస్తా. నిజానికి రాజీనామాల గురించి కోమటిరెడ్డి నాతో చెప్పనేలేదు. అలా చెప్పినట్లు ఎవరైనా అంటే.. ఆ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నా. జానారెడ్డి ఎప్పుడైనా దేనికైనా రెడీగానే ఉంటాడని మరోసారి సవాల్‌ చేస్తున్నా. నాపైనగానీ, మరొకరిపైనగానీ ప్రతిసారి ఇలా మాట్లాడటం సరికాదు. ఈ కేసీఆర్‌

ప్రభుత్వపు కక్ష, అనైతికత, నిరంకుశత్వం అందరిపట్లా ఒకే విధంగా ఉంది. అందుకు నేను మినహాయింపు కాదు. వ్యక్తులను, పార్టీలను అణిచివేసేందుకు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రయత్నిస్తున్నది’ అని జానా వివరించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంపై జానా హర్షం వ్యక్తం చేశారు. ‘మొన్న కర్ణాటకలో, ఇప్పుడు తెలంగాణలో కోర్టులు ఇచ్చిన తీర్పులు.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింతగా చాటాయి. సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్న కోర్టు గత తీర్పును అనుసరించాల్సిందిగా స్పీకర్‌ను విజ్ఞప్తి చేస్తున్నా. అసెంబ్లీ కార్యదర్శి కూడా చొరవతీసుకోవాలి. లేదంటే కోర్ట్‌ కంటెప్ట్‌కు వెళ్లాల్సి వస్తుంది అని జానా పేర్కొన్నారు. ఇదిలావుంటే తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన పంచాయితీరాజ్‌ చట్టానికి కూడా కోర్టులో ఎదురుదెబ్బ తగలడం ఖాయమని జనారెడ్డి అన్నారు. తక్షణమే అసెంబ్లీని లేదా అఖిలపక్షం సమావేశాన్ని ఏర్పాటుచేసి పీఆర్‌ చట్టంపై అందరి అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సర్కారు రూపొందించిన పంచాయితీ రాజ్‌ చట్టంలో చాలా లోపాలున్నాయి. ఇలాగే కోర్టుకు వెళితే ఎదురుదెబ్బ తప్పదు. కీలకమైన చట్టం కాబట్టి విపక్షాల సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. అందుకోసం తక్షణమే ప్రభుత్వం ముందుకురావాలి అని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు అయినా, కాకపోయినా ప్రాణహాని ఉన్నవారికి రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని జానా గుర్తుచేశారు.