ఎల్‌ఐసీ చైర్మన్ వీకే శర్మ
హైదరాబాద్,జూన్4(జనం సాక్షి ): ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన రైతుబంధు అని ఎల్‌ఐసీ చైర్మన్ వీకే శర్మ తెలిపారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీ వేదికగా రైతుబీమాపై ప్రభుత్వం, ఎల్‌ఐసీ మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ సందర్భంగా మాట్లాడిన వీకే శర్మ.. ఇవాళ ఎల్‌ఐసీకి చాలా మంచిరోజన్నారు. రైతుల కోసం ఒప్పందం కుదుర్చుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. రైతుకు జీవిత బీమా చాలా గొప్ప కార్యక్రమమని ప్రశంసించారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎంతో కష్టపడుతున్నారని.. ఆయనో విజన్ ఉన్న లీడర్ అన్నారు. తాను కూడా రైతు కుటుంబం నుంచే వచ్చానన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పని చేశానని.. ఎక్కడా రైతు జీవిత బీమా లాంటి పథకాలను చూడలేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎల్‌ఐసీ రూ. 40 వేల కోట్లు పెట్టుబడులు పెట్టిందన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తామన్నారు. రైతు జీవిత బీమా పరిహారం ఇచ్చేందుకు పది రోజులకు మించి సమయం తీసుకోబోమని హావిూ ఇస్తున్నామని వీకే శర్మ స్పష్టం చేశారు.




