హైదరాబాద్,మే10(జనం సాక్షి): మహానగర వాసులకు మెట్రోను అందుబాటులోకి తీసుకుని వస్తామని ప్రకటించిన మేరకు పలు మార్గాల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రధానంగా నాగోల్-మియాపూర్ వరకు అందుబాటులో వచ్చింది. మిగత కారిడార్లు త్వరగా పూర్తియితేనే హైటెక్ సీటీ ఉద్యోగులకు అవకాశం ఉంటుంది. ఇప్పుడంతా దీనిపై ఆసక్తి చూపుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రధానంగా హైటెక్
సిటీకి చేరుకునే వారు ఆసక్తి పెంచారు. ఐటి జాబ్స్ చేసేవారు ఇన్నాళ్లూ క్యాబ్‌లు లేదా సొంత వాహనాల్లో హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చీబౌలీ చేరుకునే వారు. ఇప్పుడు మెట్రో ఎందాక వెళుతుందో అని ఆరా తీస్తున్నారు. మహానగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన మెట్రోరైలు ముందస్తు ప్రణాళిక ఉన్నా ఆలస్యంగా పట్టాలెక్కింది. గతేడాది ప్రధాని చేతులవిూదుగా ప్రరంభం కాగా,మరి కొన్నాళ్లకు హైటెక్ సిటీ వరకు సర్వీస్ అందుబాటులోకి రానుంది. మెట్రోరైలు మూడు కారిడార్లలో ప్రస్తుతం జరుగుతున్న పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇవి పూర్తిగా అందుబాటులోకి వస్తే హైటెక్ సిటీ-నాగోల్ మధ్య సాధారణ ట్రాఫిక్ తగ్గనుందని అంచనా. ఐటి ఉద్యోగాలు చేస్తున్న వారు వివిధ ప్రాంతాల నుంచి రావడం ఇబ్బందిగా మారడంతో కొందరు ఇక్కడే అద్దె ఇళ్లలో ఉంటున్నారు. కొందరు తల్లిదండ్రలుకు దూరంగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీరంతా మెట్రో వస్తే తమ కష్టాలు గట్టెక్కుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే పనులు కొనసాగుతున్న మూడు కారిడార్లలో పనులన్నీ పూర్తి చేయనున్నట్లు మెట్రో ఎండి ఎన్‌విఎస్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా దేశంలోని పలు మహానగరాల్లో మెట్రోరైలు అందుబాటులో ఉన్నా, అక్కడున్న స్టేషన్లు, ప్రయాణికులకు అందిస్తున్న సేవలకు భిన్నంగా హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఆధునిక సేవలు అందించేందుకు వీలుగా మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. మెట్రో స్టేషన్లలోని మాల్స్‌లో షాపింగ్ చేసేందుకు వీలుగా కార్డులను రూపకల్పన చేస్తున్నామన్నారు. పంజాగుట్ట, హైటెక్‌సిటీ, ముసారాంబాగ్ మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు ఒకేచోట అన్ని రకాల సేవలందేలా మాల్స్‌గా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించడంతో ఇక నగర ప్రయాణికులు ఆసక్తి కనబరుస్తున్నారు.
—————–




