Wednesday, 4 November 2026

గ్రామ గ్రామాన నర్సరీలు

– మొక్కల పెంపకంపైనా బాధ్యత తీసుకోవాలి
– మూడవ అతిపెద్ద హరితహారానికి తెలంగాణ వైదికైంది
– మంత్రులు జూపల్లి కృష్ణారావు, జోగు రామన్న
హైదరాబాద్‌, జూన్‌25(జ‌నం సాక్షి ) : నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గ్రామ గ్రామాన నర్సరీలు ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, జోగు రామన్నలు స్పష్టం చేశారు. దూలపల్లిలోని అటవీ అకాడవిూలో గ్రామ గ్రామాన నర్సరీల ఏర్పాటుపై శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం మంత్రులు  ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరగనున్న శిక్షణా తరగతులకు 15 జిల్లాల నుంచి గ్రావిూణాభివృద్ధి, అటవీ, ఉద్యాన, వ్యవసాయ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరిత హారంపై రూపొందించిన కరదీపికను ఆవిష్కరించిన మంత్రులు జూపల్లి, జోగు రామన్న మాట్లాడుతూ… ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద హరిత హారానికి తెలంగాణ వేదికైందన్నారు. అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో ముందుకువెళ్తేనే అనుకున్న విధంగా హరిత తెలంగాణ సాధ్యం అవుతుందన్నారు. నూతన పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం గ్రామ గ్రామాన నర్సరీల ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. మొక్కలు నాటడంతో పాటు మనుగడ సాగించేలా చూడటం అందరి బాధ్యత అన్నారు. ఆ దిశగా పూర్తి అవగాహన కలిగించేందుకు ఈ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశామని మంత్రుతు తెలిపారు.