సీఎం కేసీఆర్ పర్యటన
– గట్టు ఎత్తిపోతల పథకంకు శంకుస్థాపన చేయనున్న సీఎం
– బహిరంగ సభలో ప్రసంగించనున్న కేసీఆర్
హైదరాబాద్, జూన్25(జనం సాక్షి ) : ఈ నెల 29న జోగులాంబ గద్వాల జిల్లాలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్.. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించనున్నారు. ఆ తర్వాత గట్టు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని సీఎం ప్రసంగించనున్నారు.జోగుళాంబ గద్వాల జిల్లాలో గట్టు ఎత్తిపోతల పథకానికి రూ.553.98 కోట్లకు పరిపాలనా అనుమతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిన విషయం విదితమే. మొత్తం రూ.553.98 కోట్లకు పరిపాలనా అనుమతులు లభించాయి. గట్టు ప్రాంత సమస్యకు తప్పకుండా పరిష్కారం చూపుతానని తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ ఎత్తిపోతల పథకం శంకుస్థాపనతో నిలుపుకోనున్నారు. గట్టు, ధరూర్ మండలాల్లోని 25 వేల ఎకరాల కొత్త ఆయకట్టు, మరో 3 వేల ఆయకట్టు స్థిరీకరణతో మొత్తం 28,000 ఎకరాలకు సాగునీరందించేలా ఈ ఎత్తిపోతలకు డిజైన్ చేశారు. ఇందుకోసం జేఎన్‌ఎల్‌ఐఎస్ (నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం) స్టేజ్-2 లోని రేలంపాడు రిజర్వాయర్ నుంచి పెంచికల్‌పహాడ్ రిజర్వాయర్‌కు సుమారు 2.80 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తారు. గట్టు మండలం ఆలూరు గ్రామం వద్ద పంప్‌హౌజ్‌ను నిర్మించనున్నారు. 3.23 మెగావాట్ల సామర్థ్యంతో ఉండే రెండు మోటర్లను బిగించి, ఒక్కో పంపు ద్వారా 216 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. పెంచికల్‌పహాడ్ వద్ద 0.7 టీఎంసీల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మిస్తారు. ఈ రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ 17 కి.విూ. పొడవుతో 18.5 వేల ఎకరాలు, ఎడమ కాల్వ 13.8 కి.విూ. పొడవుతో 9.5 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు.
29న గద్వాల జిల్లాలో..




