విపక్ష పార్టీలకుచెందినవారివే పోయాయన్న ఆరోపణలు
జాబితా ముందేసుకుని చూసుకుంటున్న పార్టీలు
హైదరాబాద్/అమరావతి,జూల30(జనం సాక్షి): చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు ఓట్ల గల్లంతు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన చర్చగా మారింది. అధికారంలో ఉన్న టిడిపి, టిఆర్ఎస్లో తమ పార్టీ చెందిన వారి ఓట్లను తొలగించాయని విపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. తమ గెలుపుపై ప్రభావం చూపే ఓట్లను తొలగించారని ఇసికి ఫిర్యాదులు చేస్తున్నాయి. ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలకు ఓట్ల తొలగింపు కష్టాలు వచ్చిపడ్డాయ్. ఎన్నికలకు మరికొద్ది నెలలే సమయం ఉన్న తరుణంలో పెద్ద ఎత్తున ఓట్లు మాయం కావడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక్కో నియోజకవర్గంలో 50వేలు నుంచి లక్ష వరకు ఓట్లు మాయం అయినట్లు రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. నిజానికి గత ఎన్నికల కంటే ఈసారి ఎన్నికలకు ఓటర్లు పెరగాలి. కానీ పరిస్తితి అలా లేదు. ఎన్నికల అధికారుల నిర్వాకంతో ఓటర్ల సంఖ్య గతంలో కన్నా పడిపోయిందని కొన్ని నియోజకవర్గాలను పరిశీలిస్తే అర్థం అవుతోంది. దీనితో స్థానిక ఎమ్మెల్యేనో, లేక పార్టీ నాయకులో ప్రజల వద్దకు వెళ్ళి ఓటుందా లేదా అడిగే పరిస్థితి నెలకొంది.
అయితే ఎన్నికల సంఘం అధికారుల వివరణ మరో రకంగా ఉంది. ఓటరు కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేశారు. అయితే కొందరు ఆధార్ లేకపోవడంతో ఓటు కోల్పోయారు.. అలాగే ఆధార్‌లో పేరు ఉన్నా. ఓటరు కార్డులో ఉన్న పేరుతో సరిపోకపోవడం అంటే స్పెల్లింగ్ పొరపాట్లు వంటి కారణంగా మరికొందరు ఓట్లు కోల్పోయారు. అయితే ఆధార్‌కు-ఓటరు కార్డుకు సంబంధం లేదని సుప్రీం చెప్పినా… ఆ ఆదేశాలకు అనుగుణంగా తొలగించిన వారి పేర్లను తిరిగి చేర్చలేదు.దీనితో తమ ఓట్లు ఉన్నాయనే భావనలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారు తమ ఓట్లు ఉన్నాయమో పోయాయో చూసుకోవడం లేదు. గతంలో నమోదు అయి ఉంది కనుక ఉంటుందన్న ధీమాలో చాలామంది ఓటర్లు ఉన్నారు. మరోవైపు ఎన్నికల సంఘం సర్వర్ కూడా మొరాయించడంతో సమాచారం దొరకడం లేదు. ఇటీవలి జాబితాలో ఓట్లు గల్లంతయ్యాయన్న విషయాన్ని తెలుసుకున్న పార్టీలు ఇప్పుడిదే అంశంపై దృష్టి పెట్టాయి. ఓటు ఉన్నదా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈసేవా, ఆన్లైన్, ఓటరు నమోదు కేంద్రాల వద్ద చెక్ చేసుకోవాలి ఉంటుందని, లేకపోతే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.
ఒక్కో నియోజకవర్గంలో వేలల్లో ఓట్లు తొలగిస్తే గెలుపు అవకాశలు కోల్పోవాల్సి ఉంటుందని విపక్ష పార్టీలు లెక్కలేస్తున్నాయి. ఇది వచ్చే ఎన్నికల ఫలితాలపై ప్రభావం కూడా చూపుతుందని విశ్లేషిస్తున్నాయి. దీంతో వారంతా ఆయానియోజకవర్గాల్లో ఇప్పుడు ఓట్లను సరిచూసుకునే కార్యక్రమంలో పడ్డారు. ఇరు తెలుగు రాస్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.




