పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అధిష్టానం వెల్లడి
తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న నర్సారెడ్డి
మెదక్ సీటుకు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం హావిూ?
నేడు ఢిల్లీలో రాహుల్‌గాంధీ సమక్షంలో చేరే అవకాశం
హైదరాబాద్, అక్టోబర్26(జనం సాక్షి) : తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. అభ్యర్థుల ఖరారు దగ్గర నుంచి టీఆర్‌ఎస్‌లో అసమ్మతి సెగలు భగ్గుమంటూనే ఉన్నాయి.. ఇటీవల ఎమ్మెల్సీలు భూపతి రెడ్డి, రాములు నాయక్‌తో పాటూ మరికొందరు నేతలు అసమ్మతి రాగం వినిపించారు. వీరిలో రాములు నాయక్‌పై ఏకంగా సస్పెండ్ అయ్యారు. తాజాగా మరో కీలక నేతపై వేటు పడింది. శుక్రవారం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై టీఆర్‌ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందుకు చర్యలు తీసుకున్నట్లు సస్పెండ్ చేసినట్లు పార్టీ నేతలు తెలిపారు. నర్సారెడ్డి తెలంగాణ రోడ్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఈ సస్పెన్షన్ వేటు ముందే ఊహించిందేననే చర్చ పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతోంది. పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్న నర్సారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ మారతారనే ప్రచారం, కాంగ్రెస్ ముఖ్య నేతలతో కూడా నర్సారెడ్డి మంతనాలు జరుపుతున్నారని తెలియడంతో సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్న నర్సారెడ్డి… ఇదే విషయాన్ని తెరాస ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలతో అనేకసార్లు తన ఆవేదనను వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ అపాయింట్‌మెంట్ దొరకలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కొన్నాళ్ల క్రితం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాపరెడ్డి నర్సారెడ్డిని కలిశారు. అప్పట్నుంచి ఆయన పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇదిలా ఉంటే గురువారం రాత్రి కాంగ్రెస్ నేత విజయశాంతితో నర్సారెడ్డి సమావేశమయ్యారు. అనంతరం మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని కూడా కలిసి పార్టీ వీడుతున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోనూ నర్సారెడ్డి భేటీ అయినట్లు సమాచారం. అనంతరం ఆయన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. నేడు నర్సారెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఒంటేరు ప్రతాపరెడ్డికి టికెట్ ఇప్పటికే ఖాయమైనందున మెదక్ శాసనసభ నుంచి బరిలో దిగే అవకాశం
ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. గురువారం అర్ధరాత్రి పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఒంటేరు ప్రతాపరెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు కూడా నర్సారెడ్డితో చర్చించి మెదక్ టికెట్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అక్కడ టికెట్ ఆశిస్తోన్న శశిధర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి బుజ్జగించినట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్మన్ పదవికి నర్సారెడ్డి గురువారమే రాజీనామా చేసినట్లు సమాచారం. ఇదిలావుంటే నర్సారెడ్డి గతంలో గజ్వెల్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత టిఆర్‌ఎస్ అధికరాంలోకి వచ్చాక ఆయన కెసిఆర్ పిలుపు మేరకు టిఆర్‌ఎస్‌లో చేరారు. అయితే గజ్వెల్ నుంచి చేరిన అనేకులు ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. నర్సారెడ్డితో పాటు పలువురు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారన్న ప్రచారం ఉంది.




