– ఆపరేషన్ గరుడపై విచారణ జరిపించాలి
– చంద్రబాబు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నాడు
– దాడిఘటనలో ఏ-1 చంద్రబాబు, ఏ2 డీజీపీలు
– మెరుగైన వైద్యం, భద్రత కోసమే జగన్ హైదరాబాద్ వెళ్లాడు
– ఘటనపై థర్డ్ పార్టీ ఏజెన్సీతో విచారణ జరిపించాలి
– నిందితుడు జగన్ అభిమాని కాదు.. తెదేపా కార్యకర్త
– ఫ్లెక్సీ తెదేపా నేతల సృష్టే
– న్యాయం కోసం హైకోర్టులో పిటిషన్ వేస్తున్నాం
– వైసీపీ మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి
హైదరాబాద్, అక్టోబర్26(జనం సాక్షి) : చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని, దాడి ఎలా జరిగిందో విచారణ చేపట్టేందుకు సిద్ధం కావాల్సిందిప ఓయి, దాడికి గురైన ప్రతిపక్ష నేత జగన్పై అసత్య ఆరోపణలతో ఎదురుదాడి చేస్తుండటం సిగ్గుచేటని వైసీపీ మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని సిటీ న్యూరో సెంటర్లో చికిత్స పొందుతున్న జగన్ను సుబ్బారెడ్డి పరామర్శించారు. జగన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆపరేషన్ గరుడ సృష్టికర్త చంద్రబాబేనని, ముందుగానే ఓ వ్యక్తితో చెప్పించి తరువాత పథకం ప్రకారం చంద్రబాబు తన క్రూర ఆలోచనను అమలు చేస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వ ప్రమేయం లేకుండానే జగన్పై దాడి జరిగిందా అని ప్రశ్నించారు. దాడికి పాల్పడ్డ శ్రీనివాసరావు టీడీపీకి చెందిన వ్యక్తి క్యాంటిన్లో పనిచేస్తున్నాడని, శ్రీనివాసరావును వైసీపీ అభిమానిగా చిత్రీకరించడానికి టీడీపీ ప్రయత్నించిందని ఆరోపించారు. 11నెలల క్రితం పెట్టిన ఫ్లెక్సీని ఇప్పుడు తెరపైకి తెచ్చారని, ఆరు నెలలుగా టీడీపీలో ఉన్నామని శ్రీనివాసరావు సోదరుడు చెప్పాడని ఆయన తెలిపారు. శ్రీనివాసరావు వద్ద ఉన్న లెటర్ రాత్రి 10గంటలకు విడుదల చేయడమేంటని, ఫ్లెక్సీ మాదిరిగానే లెటర్ కూడా టీడీపీ వాళ్లే సృష్టించారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. గత ఆరునెలల్లో శ్రీనివాసరావు కుటుంబానికి రెండు లోన్లు ఇచ్చారని చెప్పారు. ఆపరేషన్ గరుడ స్కీన్ర్ ప్లే డైరెక్షన్ చంద్రబాబుదేనని, ఆపరేషన్ గరుడపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు స్పందన చూస్తుంటే ఆయనకు మానవత్వం ఉందా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. 2003లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై అలిపిరి వద్ద దాడి జరిగితే.. ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్
హుటాహుటిన తిరుపతి వెళ్లి పరామర్శించారని గుర్తుచేశారు. చంద్రబాబుపై దాడిని తీవ్రంగా ఖండించిన వైఎస్.. గాంధీ బొమ్మ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. ఇప్పుడు జగన్పై దాడి జరిగితే చంద్రబాబు ఎలా స్పందిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని, జగన్ మెరుగైన వైద్యం, భద్రత కోసమే విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చారని వైవీ తెలిపారు. జగన్పై దాడి ఘటనలో ఏ-1 చంద్రబాబు, ఏ-2 డీజీపీ అని వైవీ సుబ్బారెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వ విచారణపై నమ్మకం లేదని ఆయన చెప్పారు. థర్డ్ పార్టీ ఏజెన్సీతో విచారణ జరిపించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. న్యాయం కోసం హైకోర్టులో పిటిషన్ వేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ఆపరేషన్ గరుడ .. సీ్కన్ప్లే డైరెక్షన్ చంద్రబాబే




