Tuesday, 3 November 2026

16న టెట్ నోటిఫికేషన్..?

హైదరాబాద్ : తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముందుగా టెట్ నిర్వహించి రానున్న విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ చేసేందుకు విద్యా శాఖ ప్లాన్ చేస్తోంది. వచ్చే జనవరిలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 16న వెలువడుతున్నట్లు తెలుస్తోంది. 18నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పరీక్షను జనవరి 24న జరిపేందుకు టెట్ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. టెట్ నిర్వహణకు సంబంధించి విధివిధానాలు తేదిల ప్రకటన అధికారికంగా రెండు మూడు రోజుల్లో వెలువడనుంది.తెలంగాణలో తొలిసారిగా , మూడేళ్ల విరామం తరువాత నిర్వహిస్తున్న టెట్ ఈ సారి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ఐదు లక్షల మందికి పైగా అభ్యర్దులు దరఖాస్తు చేసుకుంటారని ఓ అంచనా. ఇదిలా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో టెట్ రాసి అర్హత పొందిన వారి విషయంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన టెట్ కమిటి ఏ నిర్ణయాన్ని వెలువరించలేదు. ప్రతి పరీక్షలో తెలంగాణ చరిత్రకు ప్రాధాన్యత కల్పిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో టెట్ అర్హత పొందిన వారి విషయంలో కమిటి ఓ నిర్ణయం తీసుకోనుంది. దాంతో పాటు సైన్స్ గ్రూపులను ఎంచుకొని డిగ్రీ, బిఈడిలు పూర్తి చేసిన అభ్యర్థులకు టెట్ సోషల్ సబ్జెక్ట్ విషయంలో సైతం ఓ నిర్ణయాన్ని తీసుకోనుంది. మరో వైపు ఎన్‌సిఈఆర్‌టీఇ ఆదేశాల ప్రకారం టెట్‌ పరీక్షలను పాత పద్ధతిలోనే నిర్వహిస్తున్నట్లు సమాచారం. డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టుల భర్తికి విద్యాశాఖ సిద్ధమవుతున్న తరుణంలో టెట్ కు ప్రాధాన్యత తో పాటు అభ్యర్థులు కూడా గణనీయంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *