హుజురాబాద్ తరహాలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలి
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు డిమాండ్ – కమాన్ పూర్ లో కాంగ్రెస్ నాయకుల ధర్నా, తాసిల్దార్ కు వినతిపత్రం అందజేత జనంసాక్షి, కమాన్ పూర్ :హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ విధంగా నైతే ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇచ్చారో అదే విధంగా కమాన్పూర్ మండలంలో కూడా ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత బంధు దగా పేరిట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి ముందుగా బస్టాండ్ లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అలాగే ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అర్హులైన నిరుపేదలకే దళిత బంద్ ఇవ్వాలని కోరుతూ అనంతరం తాసిల్దార్ మోహన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వైనాల రాజు మాట్లాడుతూ.. కమాన్పూర్ మండలంలో బంగ్లాలు, భూములు ఉన్నవారికి, ఒక కుటుంబంలో ఇద్దరికీ, దళిత బంధు మంజూరు చేశారని ఇది సరైనది కాదన్నారు. ఈ జాబితాను రద్దుచేసి గుంట భూమిలేని అర్హులైన నిరుపేదలకు మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన, నిరసన కార్యక్రమంలో అధిక సంఖ్యలో మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.