Monday, 2 November 2026

24 గంటలూ డ్రంక్ అండ్ డ్రైవ్

drink-and-driveడ్రంక్ అండ్ డ్రైవ్ అంటే రాత్రి 8 గంటల తర్వాత స్టార్ట్ అయ్యి.. అర్థరాత్రి 11 గంటల వరకు మాత్రమే సాగుతుంది. ఆ తర్వాత డోంట్ వర్రీ. ఈ టైంలో తప్పించుకోగలిగితే చాలు.. హ్యాపీగా వెళ్లిపోవచ్చు అనే అభిప్రాయం ఉంది ఇప్పటి వరకు. ఇక నుంచి మీ అభిప్రాయాలను పూర్తిగా మార్చుకోండి. డ్రంక్ అండ్ డ్రైవ్ 24 గంటలూ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఆ దిశగా యాక్షన్ ప్లాన్ రెడీ అవుతోంది. కొన్ని ఘోర ప్రమాదాలు అర్థరాత్రి తర్వాతే జరుగుతుండటం.. అది కూడా మద్యం మత్తులోనే చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది రాచకొండ కమిషనరేట్.24 గంటల డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నారు. ఏ ప్రాంతాల్లో పబ్స్, బార్లు ఉన్నాయి.. మందు కొట్టి ఏయే రూట్ల నుంచి వెళతారు అనేదానిపై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చారు. కొంత మంది సందులు, గొందుల్లో వెళుతున్నారని వాళ్లను కూడా వదిలేది లేదని చెబుతున్నారు. రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ రోడ్ నెం 10లో జరిగిన యాక్సిడెంట్ కూడా ఇలాంటిదే అని చెబుతున్నారు పోలీసులు. అప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు… తనిఖీలు నిలిపేసిన ఐదు నిమిషాల్లోనే యాక్సిడెంట్ సమాచారం అందటంతో షాక్ అయ్యారు. మాదాపూర్ నుంచి మెయిన్ రోడ్ నుంచి కాకుండా సందుల్లో నుంచి వచ్చి మెయిన్ రోడ్ ఎక్కాడని ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. ఇలాంటి వారిని కూడా కట్టడి చేసేందుకు.. 24 గంటల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు రాచకొండ కమిషనర్ ప్రకటించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే తనిఖీలు ప్రారంభం అవుతాయన్నారు.

ఔటర్ రింగ్ రోడ్డుపై కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు. చెక్ పోస్టుల దగ్గరే పరీక్షించనున్నట్లు వెల్లడించారు సీపీ మహేష్ భగత్. ఈ ఏడాది ఇప్పటికే 8వేల మంది పట్టుబడ్డారని.. అందులో 500 మందికి జైలు శిక్ష పడిందన్నారు.