29నుంచి గోవా శాసన సభ సమావేశాలు 

– సమావేశాలకు హాజరుకానున్న సీఎం పారికర్‌
– వెల్లడించిన స్పీకర్‌ ప్రమోద్‌ సావంత్‌
పనాజి, జనవరి24(జ‌నంసాక్షి) : ఈనెల 29 నుంచి గోవా శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  కాగా మూడు రోజులు సాగనున్న ఈ సమావేశాలకు క్లోమ క్యాన్సర్‌ తో భాదపడుతున్న గోవా సీఎం పారికర్‌ వస్తారో రారో అన్న సంశయం నెలకొంది.  ఈ సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ ప్రమోద్‌ సావంత్‌ గురువారం మాట్లాడుతూ..  29 నుంచి జరగనున్న మూడురోజుల శాసనసభ సమావేశాలకు గోవా సీఎం పారికర్‌  హాజరవుతారని గురువారం విూడియాకు వెల్లడించారు. ఈ మూడు రోజులూ ఆయన సభకు హాజరవుతారని అన్నారు. ఈ సమావేశాలు జనవరి 29 నుంచి ప్రారంభం కానున్నాయని చెప్పారు. రెండో రోజు సభలో.. ఐదు నెలలకుగానూ ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ (తాత్కాలిక బడ్జెట్‌) తీర్మానాన్ని ప్రవేశపెడతారని
తెలిపారు. మొదటి రోజు సభలో గవర్నర్‌ మృదుల సిన్హా ప్రసంగం ఉంటుందని వివరించారు. అలాగే, గత ఏడాది జూన్‌ నుంచి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న భాజపా ఎమ్మెల్యే పాండురంగ మద్కైకర్‌ కూడా ఈ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలున్నాయని సావంత్‌ వెల్లడించారు. ‘ఈ సమావేశాలకు పాండురంగ హాజరుకారంటూ ఆయన కార్యాలయం నుంచి మాకు ఇప్పటివరకు ఎటువంటి సందేశం రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, మూడు రోజుల పాటు జరిగే ఈ సభలో చర్చించడానికి ఆ రాష్ట్ర స్పీకర్‌ కార్యాలయం సభ్యుల నుంచి 419 ప్రశ్నలు అందుకుంది. అందులో 137 ప్రశ్నలు స్టార్‌మార్క్‌ (ముఖ్యమైన)కాగా, 282 సాధారణ ప్రశ్నలు ఉన్నాయి. ఈ సమావేశాల్లో మూడు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. చాలా కాలం తరువాత పారికర్‌ పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గతేడాది నుంచి గోవా, ముంబయి, న్యూయార్క్‌, ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో ఆయన క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ నుంచి గతేడాది అక్టోబర్‌లో డిశ్చార్జ్‌ అయినప్పటి నుంచి ఆయన.. గోవాలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పటి నుంచి ఆయన చాలా అరుదుగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గతవారం ఆయన రాష్ట్రంలోని వ్యాపార సలహా కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.