Tuesday, 3 November 2026

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్‌లో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. గౌతం నగర్‌, ఇస్లాంపుర, ఖాజాకాలనీ, హబీబ్‌నగర్‌, అటోనగర్‌ ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వర్షపునీరు చేరింది. నిజామాబాద్‌ ఎల్లారెడ్డిలో 4.2సెం. మీ ల వర్షపాతం నమోదైంది. కల్యాణి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో 2గేట్లు ఎత్తివేసి 250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అదిలాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (టి) మండలంలోని టోంకిని – తాటిచెట్టు ఒర్రె వంతెనపై నుంచి పెన్‌గంగ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కౌతల, బెజ్జూరు , సిర్పూర్‌ (టి) మండలాల్లో దాదాపు వంద గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బేల మండలంలో పెస్‌గంగ ఉద్ధృతికి 1500 ఎకరాల పంట పొలాల్లో వరదనీరు నిలిచిపోయింది. వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్లు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. పరకాలలో చలివాగు ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరిలో వరద నీరు చేరడంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. నర్సంపేటలో భారీ వర్షం కారణంగా దుగ్గొండి చెరువు పొంగి ప్రవహిస్తోంది. జనగాంలో మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. నల్గొండ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మూసీ జలాశయంలోకి 500 క్యూసెక్కుల వరదనీరు చేరింది. దీంతో జలాశయంలో నీటి మట్టం 626 అడుగులకు చేరింది. ఖమ్మం జిల్లాలో  భారీ వర్షాలకు ఇల్లెందు ఏరియాలో ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *