సర్వం సన్నద్ధంనేడు వినాయక ప్రతీకలకు నిమజ్జనం
ట్రాఫిక్ ఆంక్షలు.. మార్గాలు మళ్లింపు
భారీగా బలగాల మొహరింపు
ప్రత్యేక బస్సులు.. ఎంఎంటిఎస్ రైళ్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 17 :గణేశుని ఉత్సవాల్లో కీలక ఘట్టానికి మరికొన్ని గంటల్లో తెర లేవనున్నది..నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధమైంది..జంటనగరాల్లోని నిమజ్జన ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను అమర్చారు. ప్రత్యేకంగా లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. జనరేటర్లను సైతం అందుబాటులో ఉంచారు. గజ ఈతగాళ్లను సైతం సిద్ధంగా ఉంచారు. ఖైరతాబాద్ మహాగణపతి ప్రతీకతో సహా జంటనగరాల్లోని అన్ని ప్రతీకలకు బుధవారం నిమజ్జనం జరగనున్నది. జంట నగరాల్లో ట్రాఫిక్‌ఆంక్షలు విధించారు. వాహనాల మార్గాలను మళ్లించారు. నిమజ్జనోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. జంటనగరాల్లోని ఉద్యోగులకు బుధవారం సెలవుదినంగా ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా సాలార్‌జంగ్ మ్యూజియానికి కూడా సెలవు ప్రకటించారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో వినాయక ప్రతీకల మండపాల వద్ద, నిమజ్జన ప్రాంతాల వద్ద భారీఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. హుస్సేన్‌సాగర్ వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. మొబైల్ కంట్రోల్ సెంటర్, మోటార్ సైకిల్ బోర్న్ కెమెరా మెన్స్, బ్రోంటో క్రేన్లు ఏర్పాటు చేశారు. నిమజ్జన ఊరేగింపు మార్గంలో 250 ప్రాంతాల్లో వాచ్ టాపర్లను ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్‌లో బుధవారం సుమారుగా 25వేల ప్రతీకలు నిమజ్జనమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాలు, కీలక చౌరస్తాలలో ప్రత్యేక నిఘా ఉంచారు. సీసీ కెమెరాల ద్వారా నిఘాను ముమ్మరం చేశారు. బేగంబజార్, చత్రీ, బేదర్‌వాడీ, గోడెకీ కబర్, ఫీల్‌ఖానా తదితరప్రాంతాల్లో సైతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ధూల్‌పేటలోను భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రాని కల్లా సుమారుగా 200 ప్రతీకలు నిమజ్జనమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ధూల్‌పేట ప్రధాన రోడ్డు, గంగాబౌలి, పురానాపూల్ చౌరస్తా, తదితర ప్రాంతాల్లో అదనపు బలగాలను మొహరించారు.
ఊరేగింపు ఇలా..
బుధవారం ఉదయం 9గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు ఊరేగింపు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేశవగిరి, నాగుల్‌చింత, ఫలక్‌నుమా, చార్మినార్, మదీనా, అఫ్జల్ గంజ్, ఎంజె మార్కెట్, ఆబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ, ఎన్టీఆర్ మార్గ్ వరకు ఊరేగింపు కొనసాగుతుంది. అలాగే సికింద్రాబాద్ వైపు నుండి.. రాష్ట్రపతి రోడ్డు, కర్బాలా మైదాన్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, నారాయణగూడ, హిమాయత్‌నగర్, లిబర్టీ వద్ద ఊరేగింపులో కలుస్తుంది. అదేవిధంగా ఈస్ట్‌జోన్ నుంచి.. ఉప్పల్, రామంతాపూర్, అంబర్‌పేట,ఓయు ఎన్‌సిసి, డీడీ ఆసుపత్రి మీదుగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తుంది. వెస్ట్ జోన్ వైపు నుంచి.. ఎంజె మార్కెట్ మీదుగా సచివాలయం వద్ద ఊరేగింపులో కలుస్తుంది. ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం నుండి గురువారం సాయంత్రం వరకు జంట కమిషనరేట్ల పరిధిలోని మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలిచ్చారు. చార్మినార్ సర్దార్‌మహల్ కంట్రోలు రూములో ప్రత్యేక సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
360 ప్రత్యేక బస్సులు..
కోఠి ఉమెన్స్ కళాశాల బస్టాపు వద్ద, రేతిఫైల్ బస్సు స్టేషన్ వద్ద ప్రత్యేక కమ్యూనికేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాల బస్సులు బుధవారం ఉదయం నుండి జూబ్లీ బస్సుస్టేషన్,పికెట్ వరకు మాత్రమే నడుస్తాయని అధికారులు తెలిపారు. అలాగే మహబూబ్‌నగర్, రాయచూర్, కర్నూలు వెళ్లే బస్సులు ఎంజిబిఎస్ నుంచి సాగర్‌రింగురోడ్డు మీదుగా నడుస్తాయి. అదేవిధంగా సూర్యాపేట, నార్కట్‌పల్లి, ఖమ్మం వైపు వెళ్లే బస్సులు ఎంజిబిఎస్ నుండి నడుస్తాయి. జహీరాబాద్ నుండి వచ్చే బస్సులు బోయినపల్లి మీదుగా జెబిఎస్‌కు చేరుకుంటాయి. వరంగల్ బస్సులు ఎంజిబిఎస్ నుండి ఉప్పల్ క్రాస్‌రోడ్డు మీదుగా నడుస్తాయి. శ్రీశైలం, దేవరకొండ వైపు వెళ్లే బస్సులు ఎంజిబిఎస్ నుండి సాగర్ రింగు రోడ్డు మీదుగా నడుస్తాయి. బిహెచ్‌ఇఎల్, జీడిమెట్ల, కెపిహెచ్‌బి వైపు వెళ్లే బస్సులు బాలానగర్, బోయినపల్లి, మెట్టుగూడ, తారనాక, నాగోల్, ఎల్బీనగర్ మీదుగా నడుస్తాయి. అదేవిధంగా ఎంఎంటిఎస్ రైళ్లను నడిపేందుకు కూడా దక్షిణమధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. 18వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 19వ తేదీ తెల్లవారుజామున 4 గంటల వరకు ప్రత్యేక ఎంఎంటిఎస్ రైళ్లను అందుబాటులో ఉంచనున్నది.
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..
–18వ తేదీ ఉదయం నుండి చార్మినార్ వైపు వెళ్లే బస్సులను అఫ్జల్‌గంజ్ వరకే పరిమితం
–కూకట్‌పల్లి, మియాపూర్, బిహెచ్‌ఇఎల్ నుంచి వచ్చే బస్సులు మధ్యాహ్నం నుండి ఖైరతాబాద్ వరకే పరిమితం
–మెహదీపట్నం, గచ్చిబౌలి నుండి వచ్చే బస్సులను మధ్యాహ్నం నుండి లక్డీకాపూల్ వరకే పరిమితం
–దిల్‌సుక్‌నగర్, హయత్‌నగర్, మిధాని, నాంపల్లి ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు మధ్యాహ్నం నుండి కోఠి ఉమెన్స్ కళాశాల బస్టాపు వరకు పరిమితం.. అక్కడి నుండి వెనుదిరుగుతాయి.
మణికొండలో ఉత్కంఠ
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (ఎపిఇఎంఎస్): మణికొండ సంగ్రామంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అందరి దృష్టి మణికొండపైనే పడింది. ఒక సర్పంచ్ పదవికి.. ముగ్గురే బరిలో నిలవడంతో త్రిముఖ పోటీ నెలకొంది. పైగా ఆ ముగ్గురు మాజీ ప్రజా ప్రతినిధులు కావడంతో సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. యాలాల నరేష్, జైహింద్ రావు మాజీ సర్పంచులు కాగా కొండకల్ల నరేందర్‌రెడ్డి మాజీ ఉప సర్పంచ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ ముగ్గురికి అభిమానులున్నారు. ఓటరు తీర్పు మాత్రం ఎవరికి అనుకూలంగా ఉంటుందన్న దానిపైనే సర్వత్రా చర్చ కొనసాగుతోంది. కాలనీల ఓట్లపై ముగ్గురు అభ్యర్థులు దృష్టి సారించారు. ఎవరి ప్రయత్నాల్లో వారు తలమునకలయ్యారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఈ నెల 21వ తేదీన పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. అలాగే మణికొండలోని 14వార్డు పదవులకు పోటీ చేసే అభ్యర్థులు సైతం ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు.



