హైదరాబాద్: తెలుగు ప్రజలందరికీ ఒకే రాష్ట్రం ఉండాలని ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజే విభజన బిల్లు అసెంబ్లీలో పెట్టడం దురదృష్టకరమని ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఏపీఎన్జీవోలు సచివాలయం బయట ఉన్న ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. సమైక్యవాదానికి కట్టుబడే పార్టీలతో కలిసి ఈ నెల 18 లేదా 19 తేదీల్లో అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు అశోక్ బాబు తెలిపారు. శాసన సభలో విభజన బిల్లుపై చర్చ సందర్భంగా చలో అసెంబ్లీ చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.




