Tuesday, 3 November 2026

అర్ధాంతరంగా అస్తమించిన ‘ఉదయ కిరణ’ం

హైదరాబాద్‌ : తొలి ‘చిత్ర’మే ప్రతిష్ఠాత్మక ఉషాకిరణ్‌ మూవీస్‌లో చేసే అవకాశం…సంచలన విజయం… వెనువెంటనే మూడు వరస విజయాలు సాధించి హ్యాట్రిక్‌ హీరోగా ముద్ర. యువతలో మంచి ఆదరణ. లవర్‌బాయ్‌ ఇమేజి. ఇవన్నీ హీరో ఉదయ్‌ కిరణ్‌ పరిశ్రమలో తొలినాళ్లలో సాధించిన విజయాలు.ఆ తర్వాత కొన్ని పరాజయాలు…మరికొన్ని సాధారణ విజయాలు…నటజీవితంలో కెరీర్‌గ్రాఫ్‌ ఒడిదొడుకులు సాధారకణం . కానీ అస్థిరంగా సాగిన తన కెరీర్‌ గ్రాఫ్‌ ఈ యువకుడిని నిరాశ బాట పట్టించింది. ఇదే సమయంలో వ్యక్తి గత జీవితంలోనూ వివాదం చోటు చేసుకోవడంతో పోటీలో వెనకపడిపోయారు. కొంత విరామం తీసుకుని పట్టుదలతో యత్నించి మానసికంగా, భౌతికంగా ధీశాలిగా వచ్చాడనే అనుకున్నారు అభిమానులు. ‘శీరామ్‌’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన జైశ్రీరామ్‌ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించి కొత్త ఉదయ్‌కిరణ్‌ని చూపించారు. కానీ ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వాలేకపోయింది. అవకాశాలు ఎండమావులే అయ్యాయి. చివరికి బలవన్మరణంతో మిట్ట మధ్యాహ్నపు కిరణంలా ప్రకాశించాల్సిన సమయంలో అస్తమించారు.
2000 సంవత్సరంలో తేజ దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రం’ తో తెరకు పరిచయమైన ఉదయ్‌కిరణ్‌ ఆ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం తేజ దర్శకత్వంలోనే రూపొందిన ‘నువ్వు-నేను’,వీఎస్‌ ఆదిత్య దర్శకత్వంలో ‘మనసంతా నువ్వే’లతో హ్యాట్రిక్‌ విజయాలు సాధించారు.
2013 ఏప్రిల్‌లో విడుదలైన ‘జై శ్రీరామ్‌’ ఆఖరి చిత్రం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *