నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టి సర్కార్‌కు ఆదేశం
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా గోపన్‌పల్లి ఎపిఎన్జిఓలకు ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన భూముల స్వాధీనంపై యధాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.భూమి నిరుపయోగంగా ఉందనే పేరుతో రంగారెడ్డి జిల్లా గోపన్ పల్లిలోని ఎపిఎన్జీఓలకు ఇచ్చిన 189 ఎకరాలను భూములను వెనక్కి తీసుకుంది.
గోపన్నపల్లిలోని 36, 37 సర్వే నంబర్ల పరిధిలో దాదాపు 420 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఎపీ ఎన్జీఓ, టీఎన్జీవో, హైకోర్టు ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీలకు ప్రభుత్వం గతంలో భూములు కేటాయించింది. 2003లో టిఎన్జిఓలకు 160 ఎకరాలు కేటాయించగా 2005లో ఎపిఎన్జిఓలకు 189 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.
అలాగే సచివాలయ ఉద్యోగులకు 30 ఎకరాలు, హైకోర్టు ఉద్యోగుల హౌసింగ్ సొసైటీకి 15 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అయితే 2005లో ప్రభుత్వం నుంచి భూములు పొందిన ఎపిఎన్జిఓ సొసైటీ నిర్మాణాలు చేపట్టకపోవడంతో 2007లో ఈ భూమిని వెనక్కి తీసుకునేందుకు అప్పటి సర్కార్ నోటీసులు ఇచ్చింది. తరువాత ఉద్యోగ సంఘాల ఒత్తిడితో సర్కార్ వాటి జోలికి వెళ్లలేదు.
ఎన్నికల ముందు కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ కూడా ఈ భూములను వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించి తర్వాత ఆ ఆలోచన విరమించుకుంది. తాజాగా అక్రమాలు, ప్రభుత్వ భూముల స్వాధీనంపై దృష్టి పెట్టిన కెసిఆర్ ప్రభుత్వం ఎపిఎన్జిఓ భూములను వెనక్కి తీసుకుంది.
ఎపిఎన్ జిఓలకు కేటాయించిన భూమిలో 90 ఎకరాలు తమదని ప్రైవేట్ వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ వేసి స్టే తెచ్చారని ఆ సంఘం నేత పర్చూరి అశోక్ బాబు తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా యధాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాలిచ్చిందని ఆయన గుర్తు చేశారు. మరో పది ఎకరాల భూమి స్వాతంత్ర్య సమర యోధులదని మరో కేసుపై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయించామని అశోక్ బాబు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
ఈ కేసులో గత రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతివాదిగా ఉంది. భూములు స్వాధీనం చేసుకున్న తర్వాత ఎపిఎన్‌జిఓలు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూబ్ అలీ, రెవెన్యూ శాఖ కార్యదర్శిలతో సమావేశం కాగా, వారు తమను సిఎం కెసిఆర్‌తో చర్చించాలని సూచించారని అశోక్ బాబు చెప్పారు. ఇదిలా ఉంటే ఎపిఎన్‌జిఓలు తమకు కేటాయించిన భూమిని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో హైకోర్టుకెళ్లడం గమనార్హం.




