విద్యార్థులపై అనుచిత ప్రవర్తన ఆరోపణలు!

స్పోర్ట్స్ పేరుతో ఒంటరిగా గదిలోకి పిలిచారని తల్లిదండ్రుల ఫిర్యాదు

గుదిమల్ల జెడ్పీహెచ్‌ఎస్‌ వద్ద ఆందోళన..

పాఠశాలకు చేరుకున్న ఎంఈఓ, పోలీసులు

పీఈటీ సెలవుపై.. సమగ్ర విచారణకు డిమాండ్.

ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 26 (జనం సాక్షి) విద్యార్థులకు ఆటలు నేర్పించాల్సిన పీఈటీపై వచ్చిన ఆరోపణలు గుదిమల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలకలం రేపాయి. స్పోర్ట్స్ శిక్షణ పేరుతో కొందరు విద్యార్థులను ఒంటరిగా గదిలోకి పిలిచి, వారితో అనుచితంగా మాట్లాడినట్లు పీఈటీ షేక్ షఫీ అహ్మద్‌పై తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పలువురు తల్లిదండ్రులు శనివారం పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ పిల్లల విషయంలో పీఈటీ వ్యవహరించిన తీరుపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోపణలపై ఎలాంటి పక్షపాతం లేకుండా సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.

పాఠశాలకు చేరుకున్న ఎంఈఓ

తల్లిదండ్రుల ఆందోళన విషయం తెలుసుకున్న ఎంఈఓ శ్రీనివాస్ పాఠశాలకు చేరుకుని పరిస్థితిని పరిశీలించినట్లు తెలిసింది. తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు స్వీకరించి, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.

పోలీసుల బందోబస్తు.

పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠశాల పరిసరాలను పర్యవేక్షించారు.

సెలవుపై పీఈటీ.

తల్లిదండ్రుల ఆరోపణలు వెలువడిన సమయంలో సదరు పీఈటీ పాఠశాలకు హాజరుకాకుండా సెలవులో ఉన్నట్లు సమాచారం. అయితే ఆయన సెలవుకు గల కారణాలు అధికారికంగా వెల్లడికాలేదు. ఆరోపణల్లో వాస్తవమెంత? విద్యార్థుల పట్ల అసలు ఏం జరిగింది? అన్న అంశాలు అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.

నిఘా వర్గాల ఆరా

పాఠశాలలో చోటుచేసుకున్న పరిణామాలపై నిఘా వర్గాలు కూడా వివరాలు సేకరించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన అంశాలను పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు తెలిసింది. విద్యార్థుల భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో అధికారులు చేపట్టే విచారణపై తల్లిదండ్రులు, స్థానికుల్లో ఆసక్తి నెలకొంది.