మంత్రాల సాకుతో వృద్ధురాలిని చెట్టుకు కట్టేసి దాడి

 

రంగారెడ్డి, సెప్టెంబర్ 28 (జనంసాక్షి) : ఒకవైపు సాంకేతికత అంబరాన్నంటుతోంది. ఏఐ, డిజిటల్ విప్లవంతో ప్రపంచం దూసుకుపోతోంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం మూఢనమ్మకాల భూతం ఇంకా పేదలు, వృద్ధుల జీవితాలను బలితీసుకుంటూనే ఉంది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు పట్టుమని పది కిలోమీటర్ల దూరంలో, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని మంచాల మండలం నోముల గ్రామంలో మానవత్వాన్ని దహించివేసే దారుణ ఘోరం చోటుచేసుకుంది. మంత్రాలనెపంతో పల్నాటి వెంకటమ్మ అనే వృద్ధురాలిని ఊరి నడిబొడ్డున ఉన్న వేపచెట్టుకు కట్టేసి గ్రామస్తులు పిడిబాకులు గుమ్మరించారు. విచక్షణారహితంగా దాడి చేసి చావుబతుకుల మధ్యకు నెట్టేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బట్టలు మాయమవుతున్నాయని దుర్మార్గానికి ఒడిగట్టి..

నోముల గ్రామంలో గత 15-20 రోజులుగా గర్భం దాల్చిన మహిళల బట్టలు మాయమవుతున్నాయి. మొదట ఇది వలస కార్మికుల పని అయి ఉంటుందని భావించినప్పటికీ, వారం క్రితం గ్రామానికి చెందిన ఒక బాలుడు ఓ ఇంటి నుంచి దుస్తులు తీసుకెళ్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. నిలదీయగా.. ఆ వృద్ధురాలే తనను తీసుకురమ్మని చెప్పిందని ఆ బాలుడు తెలిపాడు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన గ్రామస్తులు, మూఢనమ్మకాలతో పల్నాటి వెంకటమ్మపై పడ్డారు. “మాపై మంత్రాలు చేసి ఏం చేద్దామనుకుంటున్నావ్? ఎంతమంది మంత్రగాళ్లను తెచ్చావు? ఎందుకు బట్టలు మాయం చేస్తున్నావ్?” అంటూ పొట్టు పొట్టు కొట్టారు. తనకు ఏమీ తెలియదని, తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ వృద్ధురాలు కాళ్లు పట్టుకుని వేడుకున్నా ఆ రాక్షసుల మనసు కరగలేదు.

బాధితురాలినే పోలీసులు అదుపులో..

సమాచారం అందుకుని రంగంలోకి దిగిన మంచాల పోలీసులు.. దాడి చేసిన అకృత్యపరులను అరెస్ట్ చేయాల్సింది పోయి, గాయాలతో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలినే అదుపులోకి తీసుకోవడం గమనార్హం. నామమాత్రపు కేసులతో పోలీసులు చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, ఘటన జరుగుతున్న సమయంలో అడ్డుకోవాల్సిన చదువుకున్న యువత.. తమ ఫోన్లలో వీడియోలు తీయడానికే పరిమితమయ్యారే తప్ప, ఒక్కరు కూడా ఆ వృద్ధురాలిని కాపాడేందుకు ముందుకు రాకపోవడం సమాజంలో చచ్చిపోయిన మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది.

మేధావులు ఎక్కడ..?

చారిత్రకంగా ప్రజా ఉద్యమాలకు, చైతన్యానికి మారుపేరుగా నిలిచిన మంచాల మండల గడ్డలో ఇప్పటికీ ఇలాంటి మూఢనమ్మకాల దుర్ఘటనలు పునరావృతం కావడం అత్యంత హేయం. ఈ ఘటన పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. వృద్ధురాలి పై దాడి జరిగి వారం రోజులు కావాలని కోరుతున్న ఇప్పటివరకు ఈ రాజకీయ నాయకుడు గాని ప్రజాసంఘాలు అభ్యుదయవాదులు పరామర్శించిన దాఖలు లేవు.