మరణించిన జర్నలిస్టులకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలి

టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి జి. మధు గౌడ్ డిమాండ్
జడ్చర్ల, సెప్టెంబర్ 22 (జనంసాక్షి): మహబూబ్‌నగర్ జిల్లా సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ అకాల మరణం తీరని లోటని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి జి. మధు గౌడ్ డిమాండ్ చేశారు. మరణించిన జర్నలిస్టు కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు. మంగళవారం జడ్చర్ల మండలం నసరుల్లాబాద్‌లో నిర్వహించిన శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొన్న మధు గౌడ్ ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయంలో వైద్యం కోసం రూ. 40 వేలు అందుబాటులో లేక 30 ఏళ్ల సర్వీసు ఉన్న జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. ఉచిత హెల్త్ కార్డులు ఉండి ఉంటే శ్రీనివాస్ ప్రాణాలు దక్కేవని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల సాయంతో పాటు నెలకు రూ. 10 వేల జీవితకాల పెన్షన్ అందించాలని, వర్కింగ్ జర్నలిస్టులందరికీ వెంటనే హెల్త్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మహబూబ్‌నగర్‌లో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు కాటం నాగరాజు గౌడ్, సతీష్ రెడ్డి,ఎడిటర్లు విజయరాజు, భాస్క ర్ రావు, చం ద్రశేఖర్ గౌడ్, జర్నలిస్టులు దతేందర్, మల్లేష్ సాగర్, కే రవి, గోపాల్, రఫీ, బాలరాజు, రాఘవేందర్, రవి, శ్రీనివాస్ గౌడ్, మహేష్ కుమార్, ఐజేయు వనపర్తి జిల్లా కార్య దర్శి రాజు. పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.



