ప్రాణం పోయే వేళా.. వీడని బంధం!

పంటకు కాపలాగా వెళ్లి విద్యుత్‌ షాక్‌తో దంపతుల మృతి

గంభీరావుపేట అక్టోబర్ 2 జనం సాక్షి; రజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన గంట దేవయ్య (55), గంట లక్ష్మి (48) దంపతులు వ్యవసాయ పొలంలో విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందారు.వేరే రైతు వద్ద కౌలుకు భూమి తీసుకుని పంట సాగు చేస్తున్న దంపతులు నిత్యం పొలానికి కాపలాగా ఉంటున్నారు. పంటను పందులు, కోతుల నుంచి రక్షించేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగల కారణంగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.రాత్రి సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. ఒకేసారి దంపతులిద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో గంభీరావుపేట మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి.