గాంధీ జయంతి నాడే మద్యం ఏరులు.. అధికారుల నిద్రమత్తు, యథేచ్ఛగా బెల్ట్ షాపుల దందా!

మాడుగులపల్లి మండల కేంద్రంలో బార్లను తలపిస్తున్న బెల్ట్ షాపులు

డ్రై డే నియమాలకు పాతర.. విచ్చలవిడిగా అక్రమ మద్యం విక్రయాలు

గ్రామాల్లోనూ అదే పరిస్థితి.. మామూళ్ల మత్తులో అధికారులు?

మాడుగులపల్లి అక్టోబర్ 2 (జనం సాక్షి): అహింసామూర్తి, మహాత్మా గాంధీ జయంతి పవిత్రతను నీరుగారుస్తూ మాడుగులపల్లి మండలంలో మద్యం ఏరులై పారుతోంది అక్టోబర్ 2ను ప్రభుత్వం అధికారికంగా డ్రై డే గా ప్రకటించి, వైన్ షాపులు, మాంసం దుకాణాలను బంద్ చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, మండలంలో మాత్రం ఆ నిబంధనలు అభాసుపాలయ్యాయి వైన్ షాపులకు తాళాలు పడినా, బెల్ట్ షాపుల నిర్వాహకులు మాత్రం గేట్లు బార్లా తెరిచి దందా సాగిస్తున్నారు.

బార్లను తలపిస్తున్న బెల్ట్ షాపులు!

ముఖ్యంగా మాడుగులపల్లి మండల కేంద్రంలో పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఇక్కడి బెల్ట్ షాపులు ఏకంగా వైన్ షాపులు, బార్లను తలపిస్తూ బాహాటంగానే వ్యాపారం నిర్వహిస్తున్నాయి. మద్యం ప్రియుల వద్ద నుంచి రెట్టింపు ధరలు గుంజుతూ బెల్ట్ షాప్ నిర్వాహకులు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. మండల కేంద్రంలోనే కాకుండా పరిసర గ్రామాల్లోనూ బెల్ట్ షాపుల నిర్వాహకులు ఎటువంటి భయం లేకుండా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు.

అధికారుల ఉదాసీనతపై సర్వత్రా నిరసన!

గాంధీ జయంతి రోజున కూడా నిబంధనలను బహిరంగంగా తూర్పారబడుతూ మద్యం విక్రయిస్తున్నా సంబంధిత ఎక్సైజ్, పోలీసు అధికారులు కనీసం కన్నుత్తి చూడకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. అధికారుల మామూళ్ల మత్తు వల్లే ఈ అక్రమ దందా జోరుగా సాగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘డ్రై డే’ రోజున కూడా మద్యం ఏరులై పారుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గాంధీ జయంతి పవిత్రతను దెబ్బతీస్తూ, చట్టాన్ని బేఖాతరు చేస్తున్న బెల్ట్ షాపులపై, వాటి నిర్వాహకులపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.