బాలికపై అత్యాచారయత్నం

రంగారెడ్డి, అక్టోబర్ 2 (జనంసాక్షి) రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి గ్రామంలో సత్య సమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. నాలుగేళ్ల బాలికపై 40 సంవత్సరాల వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఇంటిముందు ఆడుకుంటున్న ఆ బాలికపై సదరు వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. లోయపల్లి గ్రామానికి చెందిన బి. నరేందర్‌ అలియాస్‌ నాని (40) సెప్టెంబరు 30న తన ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలిక(4)ను లోపలికి పిలిచాడు. సెల్‌ఫోన్‌ చూపిస్తానని ఆశ చూపించి చిన్నారిపై లైంగిక దాడికి యత్నించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆ రోజు రాత్రి చిన్నారి నొప్పితో బాధపడుతూ తల్లికి విషయం చెప్పింది. తొలుత సాధారణ నొప్పిగా భావించిన తల్లి ఆమెను సర్దిచెప్పారు. మరుసటి రోజు నొప్పి తీవ్రం కావడంతో చిన్నారి మళ్లీ ఏడవడంతో తల్లికి అనుమానం వచ్చింది. బాలికను పరిశీలించగా గాయాలు కనిపించడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో తనకు ఎదురైన ఘటనను చిన్నారి తల్లిదండ్రులకు వివరించింది. వెంటనే బాధిత కుటుంబ సభ్యులు గురువారం రాత్రి 10:30 గంటల సమయంలో డయల్‌-100కు సమాచారం అందించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు గురువారం అర్ధరాత్రి 1 గంట సమయంలో నరేందర్‌పై కేసు నమోదు చేశారు. ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. చిన్నారిపై దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన సంఘటనపై కండిస్తున్నారు.