Thursday, 12 November 2026

లోటస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

* రోగులకు ప్రత్యేక వైద్య సేవలందించిన ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ ప్రశాంతి
* రూ. 100 కే నెలకు సరిపడా షుగర్, బీపీ మందుల పంపిణీ
ఖమ్మం : ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా నగరంలోని ప్రముఖ ‘లోటస్ హాస్పిటల్’ అందిస్తున్న సామాజిక వైద్య సేవలకు విశేష ఆదరణ లభిస్తోంది. సీపీఎం ఖమ్మం టూ టౌన్ కమిటీ, బోడెపూడి విజ్ఞాన కేంద్రం (బీవీకే) ఆధ్వర్యంలో ప్రతినెలా మొదటి శనివారం నిర్వహించే ఉచిత వైద్య శిబిరానికి లోటస్ హాస్పిటల్ సంపూర్ణ సౌజన్యం అందించింది. ఈ శిబిరంలో లోటస్ హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ ప్రశాంతి పాల్గొని రోగులకు విశిష్ట వైద్య సేవలు అందించారు. శిబిరానికి భారీగా తరలివచ్చిన రోగులను ఆమె ఎంతో ఆప్యాయంగా పలకరించి, వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాడీ, మెదడు సంబంధిత సమస్యలతో పాటు ఇతర వ్యాధులపై రోగులకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు, సూచనలతో పాటు ఉచితంగా మందులు అందజేశారు.
* రూ. 100 కే నెలకు సరిపడా మందులు..
పేద, మధ్యతరగతి ప్రజలకు భారం తగ్గించే దిశగా లోటస్ హాస్పిటల్ సహకారంతో బీపీ, షుగర్ బాధితులకు కేవలం రూ. 100 కే నెలకు సరిపడా మందులను పంపిణీ చేశారు. నాణ్యమైన వైద్యాన్ని సామాన్యులకు సైతం అందుబాటులోకి తెస్తున్న లోటస్ హాస్పిటల్ యాజమాన్యాన్ని, వైద్యులను స్థానిక ప్రజలు, నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ శిబిరంలో రోగులకు రక్త పరీక్షలు, కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ భారవి, లోటస్ హాస్పిటల్ డైరెక్టర్ జె. వెంకన్న బాబు, బీవీకే బాధ్యులు వై. శ్రీనివాసరావు, సీపీఎం టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, ప్రముఖ నాయకులు పడిగల నాగేశ్వరరావు, రిటైర్డ్ ఉద్యోగులు రామకృష్ణ, పారుపల్లి ఝాన్సీ, లోటస్ హాస్పిటల్స్ సిబ్బంది సాయికుమార్, నాగరాజు, రాజు, హుస్సేన్, ప్రవళిక, నవ్య తదితరులు పాల్గొన్నారు.