జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి


జర్నలిస్టులకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందించాలి

తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం డిమాండ్

జడ్చర్ల, సెప్టెంబర్ 22 (జనంసాక్షి): గుండెపోటుతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బూర్గుల నాగేందర్ మాదిగ, ప్రధాన కార్యదర్శి బొల్లెపోగు రాజేష్ మాదిగ డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని నసురుల్లాబాద్ గ్రామంలో నిర్వహించిన జర్నలిస్టు శ్రీనివాస్ అంత్యక్రియలకు హాజరైన ఫోరం నాయకులు, ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ తర్వాత జడ్చర్ల ఎంఆర్‌సి వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, ప్రతి కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జర్నలిస్ట్ శ్రీనివాస్ పని చేసిన మీడియా సంస్థ కూడా ఆయన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే శ్రీనివాస్ మరణించారని, సంబంధిత ఆసుపత్రిపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ మరణం మాదిగ జర్నలిస్టు ఫోరంకు తీరని లోటని, ఆయన కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా కోఆర్డినేటర్ పానుగంటి సురేందర్, నాయకులు వెంకటేష్, మేతరి దాసు, ఎల్. నరసింహులు, ఎం. గోపాల్ మహారాజ్, బరిగెల శ్రీనివాస్, మహేష్ పాల్గొన్నారు.