నేడు జడ్చర్లలో గణేష్ నిమజ్జనం

నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
జడ్చర్ల, సెప్టెంబర్ 22 (జనంసాక్షి): జడ్చర్లలో నేడు బుధవారం జరిగే గణేష్ నిమజ్జనానికి నాగసాల చెరువు వద్ద సర్వం సిద్ధమైందని గణేష్ ఉత్సవ కమిటీ, వీహెచ్‌పీ నాయకులు మంగళవారం తెలిపారు. మండపాల నిర్వాహకులు విగ్రహాలను నేతాజీ చౌరస్తా స్వాగత వేదిక వద్దకు త్వరగా తీసుకువచ్చి, శోభాయాత్రను క్రమబద్ధంగా నిర్వహించాలని కోరారు. సౌండ్ సిస్టమ్‌లను పరిమితిలోనే వాడాలని సూచించారు. మరోవైపు నాగసాల చెరువు, నేతాజీ చౌరస్తా వద్ద చేపట్టిన ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ ఎం. గిరీష్ పరిశీలించారు. అధికారుల సమన్వయంతో క్యూ పద్ధతిలో నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శోభాయాత్రలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, భక్తులు, పాల్గొని విజయవంతం చేయాలని గణేష్ ఉత్సవ కమిటీ, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు కోరారు.



