కెనాన్ వర్క్‌షాప్‌లో మెరిసిన మస్కు గిరి ప్రతిభ
నల్లగొండ జిల్లా బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డు అందుకున్న చింతపల్లి యువకుడు
నల్లగొండ, జూన్ 8 (జనం సాక్షి ): ఫోటోగ్రఫీ రంగంలో తనదైన ముద్ర వేస్తూ ఎన్నో ప్రత్యేక సందర్భాలను కెమెరాలో బంధించి గుర్తింపు పొందిన చింతపల్లి మండలం మాల్ గ్రామానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ మస్కు గిరి మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. కెనాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్ సందర్భంగా జరిగిన నల్లగొండ జిల్లా బెస్ట్ ఫోటో & వీడియోగ్రాఫర్స్ అవార్డుల కార్యక్రమంలో “బెస్ట్ ఫోటోగ్రాఫర్” అవార్డును అందుకుని జిల్లా స్థాయిలో తన ప్రతిభను చాటుకున్నారు.ఫోటోగ్రఫీపై చిన్ననాటి నుంచే ఆసక్తి పెంచుకున్న మస్కు గిరి, తన సృజనాత్మక దృక్పథం, నాణ్యమైన చిత్రీకరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టుతో అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. వివాహ వేడుకలు, సామాజిక కార్యక్రమాలు, సాంస్కృతిక ఉత్సవాలు, ప్రకృతి అందాలను కళాత్మకంగా చిత్రీకరిస్తూ మంచి గుర్తింపు పొందారు.ఈ అవార్డు తన వ్యక్తిగత విజయమే కాకుండా తనను నమ్మి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరి విజయమని మస్కు గిరి పేర్కొన్నారు. తన ఎదుగుదలకు మార్గనిర్దేశం చేసిన గురువులకు, ఎప్పటికప్పుడు ప్రోత్సహించిన ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, సహచర ఫోటోగ్రాఫర్లకు, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.మస్కు గిరి సాధించిన ఈ గౌరవం మాల్ గ్రామంతో పాటు చింతపల్లి మండలానికి కూడా గర్వకారణమని స్థానిక ప్రజాప్రతినిధులు, ఫోటోగ్రఫీ రంగ ప్రముఖులు, మిత్రులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుని జిల్లాకు మరిన్ని పురస్కారాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.



