ఒకే రోజున ముగ్గురు పిల్లల జన్మదినం

ఒకే తేదీ, ఒకే నెల… రెండేళ్ల వ్యవధిలో ముగ్గురు సంతానం…
ఇలా జన్మించడం చాలా అరుదైన విషయం…
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అర్హత పొందే అవకాశం…!
ఉప్పరపల్లిలో వెలుగులోకి వచ్చిన సంఘటన…
చెన్నారావుపేట, మార్చి 13 ( జనం సాక్షి): ఒకే తేదీ… ఒకే నెల… తమ ముగ్గురు పిల్లల జన్మదిన వేడుకలను కన్న తల్లిదండ్రులు ఒకేసారి జరుపుతున్నారు. ఇదేమిటి ఒకే రోజున ముగ్గురు పిల్లల జన్మదిన వేడుకలు జరుపుకోవడం అని ఆశ్చర్యపోతున్నారా…. అవును ఇది అక్షరాలా నిజమే… ఇది ఎక్కడో కాదు…వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన మాజీ సైనికుడు చింతకింది శివకృష్ణ- మౌనిక దంపతులకు ముగ్గురు పిల్లలు సంతానం. మొదటి సంతానంగా కూతురు అక్షర జూన్ 3వ తేదీన 2020వ సంవత్సరం, రెండవ సంతానం కుమారుడు అర్జున్ జూన్ 3వ తేదీన 2022 సంవత్సరం, మూడవ సంతానం కుమారుడు ఆదిత్య 3వ తేదీన 2024 సంవత్సరంలో జన్మించారు. అంటే ముగ్గురు పిల్లలు కూడా ఒకే తేదీ, ఒకే నెల జూన్ 3వ తేదీన రెండేళ్ల వ్యవధిలో జన్మించడం విశేషంగానే చెప్పవచ్చు. అంతేకాకుండా ముగ్గురు పిల్లల జన్మదిన వేడుకలను తల్లిదండ్రులు ఒకేరోజు జరుపుకోవడం కూడా అరుదైన విషయమే. ఇది నిజంగా చాలా అరుదైన అద్భుతమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఒకే తేదీన (జూన్ 3)న వేర్వేరు సంవత్సరాల్లో(2020, 2022, 2024))లో ముగ్గురు పిల్లలు పుట్టడం అనేది గణాంకాల ప్రకారం లక్షల్లో ఒకరికి మాత్రమే ఇలాంటిది జరుగుతుంది. గణాంక పరంగా ఒకే కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఒకే తేదీన వేరువేరు సంవత్సరాల్లో పుట్టే అవకాశం 1 లక్ష 33 వేల 225 మందిలో ఒకరికి మాత్రమే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాకతాళియం వైద్యపరంగా చూస్తే ఇది కేవలం ప్రకృతి సిద్ధంగా జరిగిన ఒక గొప్ప వింత అని డెలివరీ తేదీలు సహజంగానే ఆ రోజున రావడం విశేషంగా చెప్పుకోవచ్చని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలు ఒకే తేదీన ఏప్రిల్ 9న వేరువేరు సంవత్సరాల్లో జన్మించినందుకు గాను లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు.కాని ఇక్కడ ముగ్గురు పిల్లలు ఒకే తేదీన జూన్ 3న జన్మించడం వల్ల మరింత బలమైన రికార్డు అయ్యే అవకాశం ఉంది. దీంతో మాజీ సైనికుడు చింతకింది శివకృష్ణ- మౌనిక దంపతుల ముగ్గురు పిల్లలు అక్షర, అర్జున్, ఆదిత్యలు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకునే అరుదైన అవకాశం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ తల్లిదండ్రులకు, చిన్నారులకు ఆల్ ద బెస్ట్..



