జగన్‌ను సీఎం చేసేందుకే యాత్ర
కర్నూలు: జగన్ సోదరి షర్మిల చేపట్టిన యాత్ర జైలులో ఉన్న జగన్‌ను సీఎం చేయడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ప్రజాసమస్యల పరిష్కారాని చేపట్టినది కాదని సీపీఐ రాష్ట్ర నాయకుడు రామకృష్ణ ఆరోపించారు. అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటూ జైలుకెళ్లిన జగన్‌ను సీఎం చేయాలనుకోవడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని అన్నారు. అక్రమాలకు పాల్పడి ఎన్ని ఆస్తులు కూడబెట్టుకున్నా జైలుకెళ్లవచ్చు.. తిరిగి వచ్చాక సీఎం కావచ్చు అన్న పెడధోరణులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. ప్రజలు వీటన్నింటిని గమనించాలని లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.



