హుజూర్ నగర్ మే 9 (జనంసాక్షి):మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో కంటి వెలుగు పరీక్ష శిబిరాన్ని సర్పంచ్ రమ్యనాగరాజు, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు చావా వీరభద్రరావుతో కలసి హుజూర్ నగర్ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంధత్వ రహిత సమాజాన్ని నిర్మించడంతో పాటు ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. అందులో భాగంగానే ఆరోగ్య మహిళ కంటి వెలుగు వంటి కార్యక్రమాలను ప్రారంభించి లక్షలాది మందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లద్దాలు అందజేయడం జరుగుతుందన్నారు. అంధత్వ రహిత సమాజాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణలో ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలల వలన రాష్ట్ర విద్యార్థులకు వైద్య, విద్య అందుబాటులోకి రావడంతో పాటు ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఏరియా ఆసుపత్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది నియామకం, మౌలిక సౌకర్యాల కల్పనతో పేదలకు మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గురవయ్య, వార్డు సభ్యులు బీఆర్ఎస్ నాయకులు కట్ట సతీష్, గ్రామ కార్యదర్శి ఉపేందర్, డాక్టర్ మంగా, సూపర్వైజర్ శ్రీనివాస్, మేల్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఏఎన్ఎం అలివేలుమంగా, విజయలక్ష్మి, అంగన్వాడి సిబ్బంది, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.




