హైదారబాద్, మే7(జనంసాక్షి): ఇటీవల ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం పడుతుండటంతో ఎక్కువగా ఉద్యాన పంటలు దెబ్బతింటున్నాయి. రైతులు కూరగాయలతో పాటు ఇటీవల పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈసారి దిగుబడి బాగుంటుందని రైతులు ఆశపడగా గాలులకు కాయలు రాలిపోయి నష్టాలు తప్పేలా లేవు. కొన్నిచోట్ల తోటలను వ్యాపారులు లీజుకు తీసుకున్నారు. పూత, కాత బాగుందని తీసుకుంటే కాయలు చేతికి రాకముందే గాలివానకు రాలిపోయి నష్టపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. అకాల వర్షాలు రైతుల కంటి విూద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు వర్షాలకు దెబ్బతింటుండటంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. గత కొన్ని రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా కూరగాయ పంటలతో పాటు ఉద్యాన పంటలు దెబ్బతింటున్నాయి. వేల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేస్తే చివరి నిమిషంలో వర్షార్పణం అవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి విపత్తులు తరచూ చోటు చేసుకుంటుండటంతో చేసేదేవిూలేక తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఓ వైపు ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ వర్షాలు పడుతున్నాయి. కరీంనగర్, నిజామాబాద్,ఆదిలాబాద్ జిల్లాలో పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో పదుల ఎకరాల్లో చేతికి వచ్చిన వరి పంట దెబ్బతింది. కూరగాయ పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి. కొన్ని సంవత్సరాలుగా వర్షాల క్రమం మారింది. రుతువుల ప్రకారం కాకుండా ఎప్పుడుపడితే అప్పుడు వర్షాలు పడుతున్నాయి. రెండేళ్ల క్రితం తీవ్ర వర్షాభావం నెలకొనగా గతేడాది మాత్రం అధిక వర్షాలు పడ్డాయి. ప్రకృతి విపత్తులకు అనేక కారణాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను వ్యవసాయశాఖతో పాటు ఉద్యానశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పంట నష్టం నివేదికను ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని చెబుతున్నారు. గతంలో దెబ్బతిన్న పంటలకే పరిహారం రాలేదని, ఇప్పుడు అంచనాలు వేసి పంపిస్తే ఎప్పటికి పరిహారం అందుతుందోనని రైతులు నిట్టూరుస్తున్నారు.
ఆకాల వర్షాలతో పసుపు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పసుపు తీసి ఉడికించి ఎండబెట్టే సమయంలో అకాల వర్షాలతో తడిసిపోయింది. పసుపును ఎండబెట్టి విపణికి తరలిస్తే తక్కువ ధర పలుకుందని వారు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం వర్షాలు లేక నష్టపోయామని, ఈసారి అనుకూల వర్షాలు ఉండి పంట చేతికొచ్చిన సమయంలో అకాల వర్షాలతో నష్టపోతున్నామంటున్నారు. నాణ్యత తగ్గిన పసుపును ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం వెంటనే మంజూరు చేయాలని కోరారు.




