Thursday, 5 November 2026

అత్తారింటి ఎదుట మహిళ న్యాయపోరాటం

అమీర్‌పేట: అన్నపానీయాలు లేవు.. ఎవరైనా దయదలిచి పెడితే తింటుంది.. తన భర్తను తనకు కాకుండా అత్త, ఆడబిడ్డలు అడ్డుకుంటున్నారని గత కొన్ని రోజులుగా భర్త కోసం ఓ మహిళ అత్తవారి ఇంటి వద్ద న్యాయపోరాటం చేస్తోంది. నగరంలోని ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బల్కంపేటలోని కైలాశ్‌నగర్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తేజస్విని కథనం ప్రకారం షేక్‌పేటకు చెందిన తేజస్వికికి 2008 సంవత్సరంలో బల్కంపేటకు చెందిన ఆవుల రఘునాథ్‌తో వివాహం అయింది. వివాహ సమయంలో కట్నకానుకల కింద మూడు లక్షల రూపాలయలు ఆమె తల్లిదండ్రులు ఇచ్చారు. కొద్దిరోజులు వీరి సంసారం బాగానే సాగింది. అనంతరం అత్త, ఆడబిడ్డలు తేజస్వనిపై రఘునాథ్‌కు లేనిపోని మాటలు చెబుతూ గోడవలు సృష్టించారు. రెండు సంవత్సరాల క్రితం తనకు విడాకులు కావాలని భర్త రఘునాథ్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఇందుకు ఆమె ఒప్పుకోలేదు.తల్లితండ్రులు చనిపోవడంతో తనకు దిక్కు ఎవ్వరూలేరని ఇంటి నుంచి తనను వెళ్లగొట్టారని రోదిస్తూ తెలిపింది. గతనెల 17న బల్కంపేటలోని అత్తవారి ఇంటి ముందు తన భర్త తనకు కావాలంటూ న్యాయపోరాటానికి దిగింది. అప్పటి నుంచి ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. ఎవరైనా అన్నం పెడితే తిని అక్కడే ఉంటోంది. ఎవరైనా సహాయం చేయాలని ప్రయత్నిస్తే వారిని బెదిరిస్తున్నారని తెలిపింది. బాధితురాలి ఆవేదన పలువురిని కలిచివేస్తోంది. తనకు న్యాయం చేయాలని ఆ దారిలో వెళ్లేవారిని వేడుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *