Wednesday, 4 November 2026

అత్యుత్తమ సాంకేతిక విద్యనభ్యసించడానికి ఉత్తమ మార్గం పాలిటెక్నిక్ విద్య

వేములవాడ రూరల్, జూన్ 13 (జనంసాక్షి):
అత్యంత తక్కువ ఖర్చుతో అత్యుత్తమ సాంకేతిక విద్యనభ్యసించడానికి ఉత్తమ మార్గం పాలిటెక్నిక్ విద్య అని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.రాజగోపాల్ పేర్కొన్నారు. వేములవాడ మండలం అగ్రహారంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాలిసెట్ లో ర్యాంకులు సాధించిన విద్యార్థినీ , విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు “పాలి క్వెస్ట్” (POLY QUEST) పేరిట రెండు రోజుల అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడేళ్ళ పాలిటెక్నిక్ డిప్లొమా తరువాత వివిధ ప్రభుత్వ రంగ, ప్రైవేట్ శాఖలలో ఉద్యోగం పొందవచ్చునని, స్వయం ఉపాధి చేపట్టవచ్చునని తెలిపారు. ఈసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా నేరుగా ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం లో ప్రవేశం పొందవచ్చన్నారు. పాలిటెక్నిక్ ద్వారా ఇంజనీరింగ్ విద్యతో మొత్తం ఆరు సంవత్సరాల సాంకేతిక పరిజ్ఞానం ఉంటుందని ప్రయోగాత్మక విజ్ఞానం,ఉత్తమ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడం వల్ల ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఫీజు రియంబర్స్ మెంట్ కూడా పూర్తి ఆరు సంవత్సరాలు పొందవచ్చునన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల శాఖాధిపతులు ప్రభాకరా చారి, కృష్ణ మనోహర్, రాములు, రవీందర్ లు పాల్గొని విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రుల పలు సందేహాలను నివృత్తి చేశారు . రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాలిసెట్ లో ర్యాంకులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులు , వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.