Thursday, 5 November 2026

అద్దంకిలో రైతుల రాస్తారోకో

 

సాగర్‌ జలాల విడుదల కోరుతూ ఆందోళన

ఒంగోలు,నవంబర్‌12(జ‌నంసాక్షి): పంటలు వేయండి సాగర్‌ జలాలిస్తాంఅని చెప్పిన ప్రభుత్వం తీరా రైతులు పంటలు వేసేసరికి చేతులెత్తేసింది దీంతో రైతాంగమంతా గొల్లుమంది. సాగర్‌ జలాలను అందించి రైతులను ఆదుకోవాలని కోరుతూ సోమవారం ఉదయం అద్దంకిలో వివిధ గ్రామాల రైతులు రాస్తారోకో నిర్వహించారు. సాగర జలాలు పంటలకు అందించాలని కోరుతూ నామ్‌ ఎక్స్పెస్వే రోడ్డుపైన అద్దంకి మండలంలోని గోవాడ డొంక వద్ద రైతులు, గోవాడ చిన్న కొత్తపల్లి సాదు నగర్‌ శ్రీనివాస నగర్‌ తదితర గ్రామాల రైతులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహిస్తున్నారు. తాము వేసిన పంటల్ని నష్టపోకుండా పంటల్ని దక్కించుకునేందుకు ప్రభుత్వం సాగర్‌ జలాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. పంటలు వేస్తేనే సాగర్‌ జలాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో పంటలు వేశామని, పంటలు వేసిన తర్వాత ప్రభుత్వం సాగన్‌ నీటిని విడుదల చేయకుండా రైతులను బాధపెడుతుందని రైతులంతా వాపోయారు. రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ.. పంటలను వేసుకుంటేనే సాగర్‌ జలాలిస్తామన్న ప్రభుత్వం తీరా రైతులు సన్నద్ధమై పంటలు వేసిన తరువాత సాగర్‌ జలాలు అందించడంలో విఫలమై రైతులను మోసం చేసిందన్నారు. సాగర్‌ జలాలను వెంటనే విడుదల చేసి రైతుల పంటలను కాపాడవలసిన

బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్‌ చేశారు.